Ola Electric: రివర్స్ కూడా వెళుతుంది... ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెషాలిటీ
- విద్యుత్ ఆధారిత స్కూటర్ తెస్తున్న ఓలా
- ఆగస్టు 15న మార్కెట్లోకి విడుదల
- రివర్స్ గేర్ పొందుపరిచిన వైనం
- తాళం లేకుండా యాప్ తో స్టార్ట్ చేసే ఫీచర్
పర్యావరణ పరిరక్షణ ఇప్పుడు అందరి అజెండాగా మారిన నేపథ్యంలో, భవిష్యత్తు అంతా విద్యుత్ ఆధారిత వాహనాలదేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంతో పోల్చితే ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతుండడం అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. తాజాగా, ఓలా సంస్థ కూడా విద్యుత్ ఆధారిత స్కూటర్ కు రూపకల్పన చేసింది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. ప్రస్తుతం బుకింగ్ లు నమోదు చేసుకుంటున్నారు.
అసలు విషయానికొస్తే.... ఓలా స్కూటర్ లో చాలా అరుదైన ఫీచర్ ను పొందుపరిచారు. ఈ స్కూటర్ ను రివర్స్ గేర్ లోనూ నడపొచ్చు. ఓలా స్కూటర్ లో రివర్స్ మోడ్ కూడా ఉంటుందని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భవీష్ అగర్వాల్ వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియోను పంచుకున్నారు. అందులో ఓలా స్కూటర్ రివర్స్ లో వెళ్లడాన్ని చూడొచ్చు.
ఇక, ఈ స్కూటర్ లో మరో ఆసక్తికరమైన ఫీచర్ కూడా ఉంది. తాళం చెవి అక్కర్లేకుండా యాప్ ద్వారానే దీన్ని స్టార్ట్ చేయొచ్చు. ఓలా స్కూటర్ ను కేవలం 18 నిమిషాల్లో సగం చార్జింగ్ చేయొచ్చట. ఆ సగం చార్జింగ్ తోనే 75 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చని సంస్థ వర్గాలంటున్నాయి.