BCCI: టోక్యో ఒలింపిక్స్ పతక విజేతలకు నగదు పురస్కారాలు ప్రకటించిన బీసీసీఐ
- టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు 7 పతకాలు
- ఒక స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలు
- బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా
- చోప్రాకు రూ.1 కోటి ప్రకటించిన బీసీసీఐ
గత కొన్నివారాలుగా క్రీడాభిమానులను విశేషంగా అలరించిన టోక్యో ఒలింపిక్స్ ఆదివారం (ఆగస్టు 8) ముగియనున్నాయి. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ఇప్పటిదాకా 7 పతకాలు సాధించింది. జావెలిన్ త్రో అంశంలో నీరజ్ చోప్రా సాధించిన స్వర్ణం అన్నింటికంటే హైలైట్. ఇది కాక మరో రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు భారత్ ఖాతాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టోక్యో ఒలింపిక్స్ లో వ్యక్తిగత ఈవెంట్లలో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు నగదు పురస్కారాలు ప్రకటించింది.
పసిడి పతకం సాధించి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన నీరజ్ చోప్రాకు రూ.1 కోటి అందించాలని నిర్ణయించింది. రజత పతకాలు సాధించిన మీరాబాయి చాను, రవి దహియాలకు చెరో రూ.50 లక్షలు ఇవ్వనున్నారు. కాంస్యాలు సాధించిన పీవీ సింధు, భజరంగ్ పునియా, లవ్లీనా బొర్గోహైన్ లకు రూ.25 లక్షల చొప్పున ప్రదానం చేయనుంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటనలో వెల్లడించారు.