Guntur District: రెడ్ల వర్గం నీకేం ద్రోహం చేసింది.. పోస్టులు ఎందుకు షేర్ చేస్తున్నారు?: గుంటూరు జిల్లా వ్యక్తిని విచారించిన సీఐడీ

CID Police questions Guntur man over social media posts
  • సోషల్ మీడియాలో జగన్‌కు వ్యతిరేకంగా వస్తున్న పోస్టులను షేర్ చేస్తున్నట్టు అభియోగం
  • ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి
  • మరోసారి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులను షేర్ చేస్తున్నారంటూ ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్‌కు వ్యతిరేకంగా వస్తున్న పోస్టులను ఇతరులకు షేర్ చేస్తున్న అభియోగాలపై గుంటూరు జిల్లా బుడంపాడుకు చెందిన చేరెడ్డి జనార్దన్ (63)కు పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. నిన్న మధ్యాహ్నం భార్య ఝాన్సీరాణితో కలిసి సీఐడీ కార్యాలయానికి వెళ్లిన జనార్దన్‌పై అధికారులు పలు ప్రశ్నలు సంధించారు.

జనార్దన్‌ను మాత్రమే లోపలికి పిలిచిన అధికారులు.. రెడ్లంటే మీకు కోపమా?.. అందుకనే జగన్‌కు వ్యతిరేకంగా పోస్టులు షేర్ చేస్తున్నారా? ఇలా చేయడం వల్ల మీకొచ్చే ప్రయోజనం ఏంటి? రెడ్డి సామాజిక వర్గం మీకేం ద్రోహం చేసింది? ఇలాంటి పోస్టులు పెట్టమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నది ఎవరు? అంటూ వరుసగా ప్రశ్నలు సంధించారు. అయితే, తాను ఎవరికీ వ్యతిరేకిని కానని జనార్దన్ పేర్కొన్నారు. ఇలాంటి పోస్టులు మరోసారి పెట్టొద్దని, పెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించిన అధికారులు రాత్రి ఏడున్నర గంటల సమయంలో సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు.
Guntur District
YS Jagan
Social Media
CID

More Telugu News