Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు
- ఉగ్రవాదులకు నిధుల చేరవేతకు సంబంధించిన కేసులో తనిఖీలు
- ఎన్‌ఐఏ ఆధ్వర్యంలో 14 జిల్లాల్లోని 45 ప్రాంతాల్లో సోదాలు
- నిషేధిత జమాతే ఇస్లామీ సభ్యుల నివాసాల్లో కీలక పత్రాలు స్వాధీనం
ఉగ్రవాదులకు నిధుల చేరవేతకు సంబంధించిన ఓ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) జమ్మూకశ్మీర్ లోని 14 జిల్లాల్లోని 45 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తోంది. నిషేధిత జమాతే ఇస్లామీ సభ్యుల నివాసాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. ఢిల్లీ నుంచి ప్రత్యేక ఎన్‌ఐఏ బృందం జమ్మూకశ్మీర్ వెళ్లి ఈ తనిఖీలు చేస్తోంది.
జమ్మూకశ్మీర్ పోలీసులతో పాటు సీఆర్‌పీఎఫ్ బృందాలు కూడా ఈ తనిఖీల్లో పాల్గొంటున్నాయి. పలు ప్రాంతాల్లో కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్‌లో జమాతే పాకిస్థాన్ అనుకూల కార్యక్రమాలు చేపడుతోంది. అలాగే, అక్కడ పలు ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చుతున్నట్లు ఇటీవల వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే అధికారులు తనిఖీలు చేపడుతున్నారు.