Pallavi: చిత్తూరు జిల్లాలో వినూత్న రీతిలో తనిఖీలు చేసిన డిప్యూటీ కలెక్టర్ పల్లవి
- క్షేత్రస్థాయి తనిఖీలకు వెళ్లాలని అధికారులకు సీఎం ఆదేశం
- పాటించిన చిత్తూరు డిప్యూటీ కలెక్టర్
- సాధారణ మహిళలా వార్డు సచివాలయానికి రాక
- సొంతింటికి దరఖాస్తు కోరిన వైనం
- ఆమెను గుర్తించిన అధికారులు
ఇటీవల సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్షలో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల పనితీరును క్షేత్రస్థాయిలో తరచుగా తనిఖీలు చేస్తుండాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా డిప్యూటీ కలెక్టర్ పల్లవి వినూత్న రీతిలో తనిఖీలు చేశారు. ఓ సాధారణ మహిళలా వార్డు సచివాలయానికి వెళ్లి అక్కడి ఉద్యోగుల పనితీరును పరిశీలించారు.
చిత్తూరు పట్టణంలోని 36వ వార్డు సచివాలయానికి వెళ్లిన ఆమె.... తాను ఏడాది కిందట తిరుపతి నుంచి చిత్తూరుకు వచ్చేశానని, తనకు సొంతింటి కోసం దరఖాస్తు చేసి, మంజూరయ్యేలా చూడాలని వార్డు సచివాలయ ఉద్యోగులను కోరింది. దరఖాస్తు గురించి అక్కడున్న కార్యదర్శులు ఆమెతో మాట్లాడుతుండగా, అక్కడికి గృహ నిర్మాణ శాఖ అధికారులు వచ్చారు. వారు అక్కడ కార్యదర్శులతో మాట్లాడుతున్నది డిప్యూటీ కలెక్టర్ పల్లవి అని గుర్తించారు. వారు ఈ విషయాన్ని కార్యదర్శులకు తెలపడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
కాగా, పల్లవి చిత్తూరు డివిజన్ కు గృహనిర్మాణ శాఖ ప్రత్యేక అధికారిణిగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు సొంత ఇళ్లు నిర్మించడాన్ని లక్ష్యంగా చేసుకుని పనిచేయాలని వార్డు సచివాలయ ఉద్యోగులకు స్పష్టం చేశారు. ఆ వార్డు సచివాలయంలోని రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆపై చిత్తూరులోని పలు సచివాలయాల్లోనూ తనిఖీలు చేసి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు.