TRS: సీఐకి టీఆర్ ఎస్ జెడ్పీ చైర్ పర్సన్ భర్త వార్నింగ్.. ఎమ్మెల్యేతో విభేదాలు?: ఆడియో సంభాషణ వైరల్
- గద్వాల్ సీఐతో జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ భర్త వాగ్వివాదం
- ఎమ్మెల్యేకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ ఆరోపణలు
- ఎస్సైని ఏసీబీ రైడ్స్ చేయించి తొక్కేస్తానని హెచ్చరిక
- ఆ ఘటన తర్వాతే సీఐ సస్పెండ్ అయ్యారన్న ప్రచారం
టీఆర్ఎస్ లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. గద్వాల్ జిల్లా గట్టు మండలం గొర్లఖాన్ దొడ్డిలో ఓ కేసుకు సంబంధించి.. గద్వాల్ సీఐగా పనిచేసి సస్పెండ్ అయిన హనుమంతుతో ఆ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ సరిత భర్త తిరుపతయ్య సంభాషణ వైరల్ గా మారింది. గద్వాల్ ఎమ్మెల్యే, స్థానిక ఎస్సైపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఓ వ్యక్తి అనుమానాస్పద మృతికి సంబంధించి ఎస్సై ఇచ్చిన నివేదికపై మండిపడ్డారు.
ఎమ్మెల్యే ఇంట్లో పనిచేస్తున్నావా? లేదా గవర్నమెంట్ డ్యూటీ చేస్తున్నావా? అంటూ ఎస్సైపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కువ మాట్లాడితే ఎస్సైని ఏసీబీ రైడ్స్ చేయించి తొక్కేస్తానని హనుమంతుతో అన్నారు. పోలీసులు న్యాయంగా పనిచేయాలని, ఎవరి డ్యూటీ వారు చేయాలని సూచించారు. లేదంటే పోలీసులందరిమీదా ఏసీబీ దాడులు చేయిస్తానని హెచ్చరించారు. కేసీఆర్ దగ్గర ఫిర్యాదు చేస్తానని చెప్పారు. అయితే, ఈ ఘటన జరిగిన తర్వాతే సీఐ హనుమంతును సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. టీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయన్న చర్చ జరుగుతోంది.