Atchannaidu: అమరావతిని ధ్వంసం చేయడానికి జగన్ కు మనసెలా ఒప్పింది?: అచ్చెన్నాయుడు

Atchannaidu and Yanamala fires on CM Jagan over farmers agitations

  • అమరావతి రైతుల దీక్షలకు 600 రోజులు
  • రైతులకు మద్దతిస్తున్నట్టు అచ్చెన్న వెల్లడి
  • జగన్ మాట తప్పారని ఆరోపణ
  • రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారన్న యనమల

అమరావతి రైతుల ఆందోళనలు 600వ రోజుకు చేరిన నేపథ్యంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతులకు టీడీపీ మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రజల కలను జగన్ చెల్లాచెదురు చేశారని ఆరోపించారు. భవిష్యత్ ను అంధకారం చేస్తున్న జగన్ పై ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు.

రాజధానిగా అమరావతిని నిండు మనసుతో స్వాగతిస్తున్నానని గతంలో నిండు అసెంబ్లీలో జగన్ చెప్పింది నిజం కాదా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అలాంటిది, అమరావతిని ధ్వంసం చేయడానికి జగన్ కు మనసెలా ఒప్పిందని నిలదీశారు.

అటు, టీడీపీ సీనియర్ నేత యనమల స్పందిస్తూ, శాంతియుతంగా దీక్షలు చేస్తున్న రైతులపై ఆంక్షలేంటని అన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం భూములను త్యాగం చేయడమే వారి తప్పా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో పౌరహక్కులు రాజ్యాంగంలోని పేజీలకే పరిమితం అయ్యాయని విమర్శించారు.

నాడు అసెంబ్లీ సాక్షిగా అమరావతిని స్వాగతించిన జగన్, నేడు అదే అసెంబ్లీ సాక్షిగా అమరావతిని అడ్డుకుంటున్నారని యనమల వ్యాఖ్యానించారు. అటు, మీడియాను కూడా అడ్డుకుంటూ పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని, జగన్ తన అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News