India: మోదీ అధ్యక్షతన నేడు ఐరాస భద్రతా మండలి బహిరంగ చర్చ.. ఈ ఘనత దక్కిన తొలి ప్రధానిగా మోదీ రికార్డు!
- సముద్ర భద్రత మెరుగుపరచడంపైనే ప్రధాన చర్చ
- సాయంత్రం ఐదున్నర గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభం
- పుతిన్ సహా పలువురు ప్రపంచ దేశాధినేతల హాజరు
నేటి సాయంత్రం జరగనున్న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి బహిరంగ చర్చకు భారత ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షత వహించనున్నారు. ఫలితంగా ఆ ఘనత దక్కించుకున్న తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డులకు ఎక్కబోతున్నారు. సముద్ర భద్రత పెంపు తదితర అంశాలు ఇందులో చర్చకు రానున్నాయి.
ఫ్రాన్స్ నుంచి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ నెలలో ఐరాస భద్రతామండలి ప్రెసిడెన్సీని భారతదేశం స్వీకరించింది. ఈ సమయంలో సముద్ర భద్రత, శాంతి పరిరక్షణ, తీవ్రవాద నిరోధానికి సంబంధించి మూడు ఉన్నత స్థాయి సంతకాల సమావేశాన్ని నిర్వహించనున్నట్టు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి తెలిపారు.
‘సముద్ర భద్రత మెరుగుపరచడం - అంతర్జాతీయ సహకారం’ పేరుతో నేటి సాయంత్రం 5.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చ ప్రారంభం అవుతుంది. భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగే ఈ చర్చలో పాల్గొంటున్న ప్రపంచ దేశాధినేతల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఉన్నారు. భద్రతా మండలి వెబ్‌సైట్ ద్వారా ఈ చర్చను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.