Pakistan: పాకిస్థాన్‌లో హిందూ ఆలయంపై దాడిని ఖండిస్తూ ఖైబర్ ఫక్తుంఖ్వా అసెంబ్లీ తీర్మానం
- భోంగ్ పట్టణంలో దేవాలయంపై దాడి
- ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
- మైనారిటీ సభ్యుడు ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం
పాకిస్థాన్‌లోని హిందూ దేవాలయంపై ఇటీవల జరిగిన దాడిని ఆ దేశ సుప్రీంకోర్టు ఇటీవల తీవ్రంగా పరిగణించగా, తాజాగా ఖైబర్ ఫక్తుంఖ్వా అసెంబ్లీ కూడా ఈ దాడిని ఖండించింది. గత బుధవారం భోంగ్ పట్టణంలోని హిందూ దేవాలయంపై జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు ఇటీవల వైరల్ అయ్యాయి. అంతర్జాతీయ సమాజం కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. ఆ దేశ సుప్రీంకోర్టు ఈ ఘటనపై స్పందిస్తూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో దిగొచ్చిన పోలీసులు 150 మందిపై కేసు నమోదు చేసి 50 మందిని అరెస్ట్ చేశారు. ఈ నెల 13న కేసు తదుపరి విచారణ జరగనుంది.
కాగా, ఆలయంపై దాడిని ఖైబర్ ఫక్తుంఖ్వా అసెంబ్లీ ఖండించింది. రవికుమార్ అనే మైనారిటీ సభ్యుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా అంగీకరించింది. ప్రావిన్స్‌లో మైనార్టీ వ్యవహారాల కమిషన్ నియామకానికి సంబంధించి మరో తీర్మానాన్ని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి షౌకత్ యూసఫ్‌జాయ్ ప్రవేశపెట్టారు. దీనిని కూడా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.