Raghu Rama Krishna Raju: జగన్, విజయసాయిలపై రాష్ట్రపతికి నేను చేసిన ఫిర్యాదును సంబంధిత శాఖలకు పంపారు: రఘురామకృష్ణరాజు
- అక్రమాస్తులు, సీబీఐ ఛార్జ్ షీట్ల గురించి రాష్ట్రపతికి రఘురాజు నివేదిక
- రాష్ట్రపతి భవన్ నుంచి రఘురాజుకు లేఖ
- సంబంధిత శాఖలకు పరిశీలనార్థం పంపినట్టు పేర్కొన్న రాష్ట్రపతి భవన్
వైసీపీ అధిష్ఠానానికి, ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు మధ్య వివాదం ముదురుతోంది. అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో రఘురాజు పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, రఘరాజు లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ ఎంపీలు పలుమార్లు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో జగన్, విజయసాయిరెడ్డిల ఆర్థిక అక్రమాలు, సీబీఐ కోర్టులో పెండింగులో ఉన్న ఛార్జ్ షీట్ల గురించి భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు రఘురాజు లేఖ రాశారు. ఈ అంశాన్ని సంబంధిత శాఖలకు పంపినట్టు రాష్ట్రపతి భవన్ నుంచి రఘురాజుకు అధికారికంగా లేఖ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
'గౌరవ రాష్ట్రపతికి జగన్, విజయసాయిరెడ్డిల ఆర్థిక అక్రమాలు, వారిపై సీబీఐ కోర్టులో ఉన్న పెండింగ్ ఛార్జ్ షీట్లపై నేను పంపిన పూర్తి నివేదికను... పరిశీలించాలని సంబంధిత శాఖలకు పంపించారు' అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చిన లేఖను షేర్ చేశారు.