Team India: ఇది నిజంగా సిగ్గుచేటు.. మ్యాచ్ డ్రా కావడంపై కోహ్లీ అసహనం
- ఐదోరోజు ఆట కొనసాగించలేకపోవడంపై అసంతృప్తి
- గెలిచే స్థితిలో ఉన్నామని కామెంట్
- ఓపెనర్లు బాగా రాణించారని ప్రశంస
ఇంగ్లండ్ తో తొలి టెస్టు చివరి రోజు వర్షం ఆటంకం కలిగించడం, మ్యాచ్ డ్రా కావడంపై టీమిండియా కెప్టెన్ కోహ్లీ స్పందిస్తూ, కొంత అసహనం వ్యక్తం చేశాడు. గెలిచే స్థితిలో ఉండి కూడా మ్యాచ్ డ్రా కావడం ఆవేదనకు గురి చేసిందన్నాడు. ‘‘ఇది నిజంగా సిగ్గుచేటు. లక్ష్య ఛేదనలో మేం మంచి స్థితిలో ఉన్నాం. గెలుస్తామన్న నమ్మకంతో ఉన్నాం. కానీ, మూడో రోజో.. నాలుగో రోజో పడుతుందనుకున్న వర్షం.. ఐదో రోజు పడి మా ఆశలపై నీళ్లు చల్లింది. ఆ రోజు మొత్తం ఆట ఆడే వీలు లేకుండా పోయింది’’ అని వ్యాఖ్యానించాడు.
ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ నాటింగ్ హాంలో జరిగిన సంగతి తెలిసిందే. ఐదోరోజూ ఎడతెరిపిలేని వానతో మ్యాచ్ ను రద్దు చేశారు. అప్పటికి భారత్ కు 157 పరుగులు అవసరం కాగా.. 9 వికెట్లు చేతిలో ఉన్నాయి. దీంతో భారత్ గెలుస్తుందని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా మ్యాచ్ డ్రా అయింది. తర్వాత మీడియాతో మాట్లాడిన కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు.
209 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్లు బాగా ఆడారని, అదే జోష్ లో ఐదోరోజు ఆటకు సిద్ధమయ్యామని అన్నాడు. అప్పటిదాకా బ్యాటింగ్, బౌలింగ్ లో తమదే పై చేయి అని, కానీ, ఆఖరి రోజు ఆట కొనసాగించలేకపోవడం సిగ్గుచేటని చెప్పుకొచ్చాడు.