Thatikonda Rajaiah: బ్రదర్ అనిల్ ను కలవలేదు.. జీవితాంతం టీఆర్ఎస్ లోనే ఉంటా: తాటికొండ రాజయ్య
- నేను లోటస్ పాండ్ కు వెళ్లలేదు
- వ్యక్తిగత పరిచయాలను రాజకీయాలతో ముడిపెట్టొద్దు
- కడియం శ్రీహరికి, నాకు మధ్య ఆధిపత్య పోరు ఉంది
వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య భేటీ అయ్యారనే వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజయ్య మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. తాను లోటస్ పాండ్ కు వెళ్లలేదని, అసలు బ్రదర్ అనిల్ ను తాను కలవలేదని చెప్పారు. వ్యక్తిగత పరిచయాలను రాజకీయాలతో ముడిపెట్టే ప్రయత్నం చేయవద్దని కోరారు. పాత ఫొటోలను ఉపయోగిస్తూ తాను పార్టీ మారబోతున్నట్టు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాలతో మనసును గాయపరచొద్దని అన్నారు.
తెలంగాణ తొలి డిప్యూటీ సీఎంగా చరిత్రలో నిలిచిపోయేలా తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పించారని... తాను జీవితాంతం టీఆర్ఎస్ లోనే ఉంటానని అన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వలేకపోయారు కాబట్టే.. ఇప్పుడు దళితబంధును తీసుకొస్తున్నారని చెప్పారు.
కడియం శ్రీహరికి, తనకు మధ్య ఆధిపత్యపోరు ఉందని రాజయ్య అన్నారు. తామిద్దరం ఒకే జాతి బిడ్డలమని, అందుకే తమ మధ్య పోటీ ఉందని చెప్పారు. ఆయన రెండు సార్లు గెలిస్తే... తాను నాలుగు సార్లు గెలిచానని అన్నారు. కొన్ని విషయాల్లో శ్రీహరిని తాను ఆదర్శంగా తీసుకుంటానని.. అందుకే గురువుని మించిన శిష్యుడిని అయ్యానని చెప్పారు.