Nagababu: దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది.. రతన్ టాటాను రాష్ట్రపతి చేయండి: నాగబాబు
- దేశాన్ని అమితంగా ప్రేమించే వ్యక్తి రాష్ట్రపతి కావాలి
- ఎత్తులకు పైఎత్తులు వేసే వ్యక్తి అవసరం లేదు
- దేశాన్ని కుటుంబంలా భావించే వ్యక్తి కావాలి
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాను భారత రాష్ట్రపతిని చేయాలని సినీ నటుడు నాగబాబు కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని... ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని అమితంగా ప్రేమించే వ్యక్తిని రాష్ట్రపతిని చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎత్తులకు పైఎత్తులు వేసే వ్యక్తి రాష్ట్రపతిగా అవసరం లేదని... దేశాన్ని ఒక కుటుంబంలా భావించే వ్యక్తి రాష్ట్రపతి కావాలని అన్నారు. తన ట్వీట్ కు #RatanTataforPresident అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు. వచ్చే ఏడాది జులై 25తో రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. దీంతో, తదుపరి రాష్ట్రపతి గురించి అప్పుడే జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా ప్రెసిడెంట్ రేసులో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.