Vishnu Vardhan Reddy: మీరు ఆచరిస్తున్న మత విశ్వాసాలపై మీకే నమ్మకం లేదా?: డిప్యూటీ సీఎం అంజాద్ బాషాపై బీజేపీ నేత విష్ణు విమర్శలు
- టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు వివాదాస్పదం
- వైసీపీ వర్సెస్ బీజేపీ
- విగ్రహారాధనకు ఇస్లాం వ్యతిరేకమన్న విష్ణు
- టిప్పు విగ్రహం ఎలా పెడతారంటూ బాషాకు ప్రశ్నాస్త్రం
కడప జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు అంశం వైసీపీ, బీజేపీ నేతల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీసింది. ఇప్పటికే ఈ అంశంలో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. తాజాగా ఈ వ్యవహారంలో విష్ణువర్ధన్ రెడ్డి ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాపై ధ్వజమెత్తారు. టిప్పు సుల్తాన్ ఒక మహనీయుడు అని, ఆయన విగ్రహాలు పెడితే తప్పేంటి అని అంజాద్ బాషా అంటున్నారని వెల్లడించారు.
"ఇస్లాం మతం విగ్రహారాధనకు వ్యతిరేకం కదా! మరి ఇస్లాం మతాన్ని పాటిస్తున్న మీరు టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటును ఎందుకు సమర్థిస్తున్నారు? మీరు ఆచరిస్తున్న మత విశ్వాసాలపై మీకే నమ్మకం లేదా?" అని ప్రశ్నించారు. బీజేపీలో మైనారిటీలు కూడా ఉన్నారని, ముస్లిం, క్రైస్తవుల కోసం ప్రత్యేకంగా మైనారిటీ మోర్చా కూడా ఉందని వెల్లడించారు. కేంద్రంలోనూ, తాము అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాల్లోనూ మైనారిటీలు మంత్రులుగా ఉన్నారని విష్ణువర్ధన్ రెడ్డి వివరించారు. మరి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నది ఎవరు? అని ప్రశ్నించారు.
ప్రభుత్వానికి ఆదాయంలేని చర్చిలు, మసీదులను ప్రభుత్వ సొమ్ముతో కట్టిస్తున్న మీరు, ప్రభుత్వానికి ఆదాయం ఇస్తున్న దేవాలయాలను ఎందుకు కట్టించరు? అని నిలదీశారు. గోమాతపై దుర్మార్గపూరిత వ్యాఖ్యలు చేసిన మీ వైసీపీ నేతలను ఏమనాలి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు చెప్పండి ఎవరిది మతతత్వ పార్టీ? ఇప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు చేసున్నది ఎవరు? అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.