YS Vivekananda Reddy: వారు తప్పించుకునేందుకు మా అన్నని ఇరికిస్తున్నారు.. వివేకాను చంపిందెవరో జగన్‌కు తెలుసు: సునీల్ యాదవ్ సోదరుడు
- పెద్దలు, సీబీఐ నుంచి ప్రాణహాని
- కాలువలో మారణాయుధాల పేరుతో సీబీఐ అధికారుల హంగామా
- వివేకా రెండుమూడుసార్లు మా ఇంటికి వచ్చారు
- ఆ 11 మందిని సీబీఐ ఎందుకు విచారించడం లేదు?: సునీల్ భార్య లక్ష్మి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఉన్న పెద్దలు, సీబీఐ నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఈ కేసులో అరెస్ట్ అయిన సునీల్‌కుమార్ యాదవ్ సోదరుడు కిరణ్‌కుమార్ యాదవ్ ఆరోపించారు. పులివెందులలోని తమ నివాసంలో కిరణ్ నిన్న సాయంత్రం విలేకరులతో మాట్లాడారు.
వివేకా హత్య కేసులో ఉన్న కొందరు పెద్ద నాయకులు తప్పించుకునేందుకు తన అన్నని ఇరికిస్తున్నారని అన్నారు. వివేకాను హత్య చేసింది ఎవరో ముఖ్యమంత్రి జగన్‌కు, ప్రజలకు కూడా తెలుసన్నారు. తన అన్నను నిందితుడిగా చూపించేందుకు కాలువలో మారణాయుధాల పేరుతో సీబీఐ అధికారులు లేనిపోనివన్నీ సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వివేకా హత్యపై ఇప్పటి వరకు మాట్లాడని రంగన్న రెండేళ్ల తర్వాత ఇప్పుడు తన వాంగ్మూలంలో తన అన్న పేరు చెప్పారని అన్నారు. వివేకానందరెడ్డి, తన అన్న మధ్య ఎలాంటి లావాదేవీలు జరగలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వివేకానందరెడ్డి రెండుమూడుసార్లు తమ ఇంటికి వచ్చినట్టు కిరణ్ తెలిపారు.
సునీల్ భార్య లక్ష్మి మాట్లాడుతూ.. వివేకానందరెడ్డి కుమార్తె హైకోర్టుకు సమర్పించిన జాబితాలోని 11 మంది అనుమానితులను సీబీఐ అధికారులు ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. తన భర్తను ఢిల్లీలో 2 నెలల 25 రోజులపాటు దారుణంగా హింసించారని, వివేకా హత్య కేసులో ప్రమేయం ఉందని ఒప్పుకోవాలని కొట్టారని ఆమె ఆరోపించారు.