Burj Khalifa: బుర్జ్ ఖలీఫా కొనంచున మహిళ.. వైరల్ అవుతున్న ప్రకటన.. ఇవిగో వీడియోలు!
- ప్రపంచంలోనే ఎత్తైన భవనంపై ఎమిరేట్స్ ప్రకటన
- యూఏఈని బ్రిటన్ యాంబర్ లిస్టులో చేర్చడంపై సంతోషం
- మేకింగ్ వీడియోనూ పోస్ట్ చేసిన సంస్థ
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆకాశహర్మ్యం కొన అంచున నిలబడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి! 830 మీటర్ల ఎత్తులో.. కిందకు తోసేటంతటి వేగంతో వీచే గాలుల మధ్య నిలబడితే కొందరికి థ్రిల్లింగ్ గా అనిపిస్తే.. మరికొందరికి మాత్రం పై ప్రాణాలు పైనే పోవూ! ఇదిగో ఈ మహిళ ప్రపంచంలోనే ఎత్తైన భవంతి బుర్జ్ ఖలీఫా కొనంచున నిలబడింది. ఆ థ్రిల్ ను ఎంజాయ్ చేసింది.
అయితే, ఇదంతా ప్రపంచంలోనే అత్యున్నత సేవలు అందిస్తుందని పేరున్న విమానయాన సంస్థ ఎమిరేట్స్ వాణిజ్య ప్రకటన కోసమే. 33 క్షణాలున్న ఆ ప్రకటనలో నటించిన మహిళ పేరు నికోల్ స్మిత్ లూద్విక్. ఆమె స్కై డైవింగ్ శిక్షకురాలు. యోగా గురువు కూడా. కొండలు గుట్టలూ ఎక్కే సాహసమూ ఆమె హాబీల్లో ఒకటి. ప్రకటనలో భాగంగా బిల్డింగ్ కొనంచున నిలబడి ‘‘బ్రిటన్ ‘యాంబర్ లిస్టు’లో యూఏఈని చేర్చినందుకు మేం గాల్లో తేలిపోతున్నాం. ఫ్లై ఎమిరేట్స్, ఫ్లై బెటర్’’ అనే ప్లకార్డులను నికోల్ ప్రదర్శించింది.
ఈ అనుభవాన్ని తాను మాటల్లో చెప్పలేనని నికోల్ అంటోంది. తన జీవితంలో ఇదే అత్యంత ఉత్కంఠభరితమైన స్టంట్ అనడంలో ఎలాంటి సందేహమూ లేదని తెలిపింది. ఇంత మంచి వాణిజ్య ప్రకటనను షూట్ చేసినందుకు ఎమిరేట్స్ కు ధన్యవాదాలు అని తెలిపింది. ఇందులో భాగస్వామిని అయినందుకు చాలా ఆనందంగా ఉందని పేర్కొంది. ఇక, ఆమె సాహసాన్ని అందరూ కొనియాడుతున్నారు.
కొందరు అసలు ఇది నిజమా? అబద్ధమా? ఫేక్ వీడియోను ఏమైనా పోస్ట్ చేశారా? అని నేరుగా సంస్థకే ట్వీట్లు చేయడం మొదలుపెట్టారట. దీంతో అది ఫేక్ కాదు.. నిజమేనని క్లారిటీ ఇచ్చింది ఫ్లై ఎమిరేట్స్ సంస్థ. ఆ ప్రకటనకు సంబంధించిన మేకింగ్ వీడియోను ట్వీట్ చేసింది. ఇంకేం ఆలస్యం.. మీరు ఆ రెండు వీడియోలపై ఓ లుక్కేసేయండి!