Vishnu Vardhan Reddy: ఇచ్చిన మాట ప్రకారం కాణిపాకం వచ్చి ప్రమాణం చేశా... ఎమ్మెల్యే రాచమల్లు ఎందుకు రాలేదు?: విష్ణువర్ధన్ రెడ్డి
- టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుపై వివాదం
- తీవ్ర విమర్శలు చేసుకున్న విష్ణు, రాచమల్లు
- రాచమల్లుకు సవాల్ విసిరిన బీజేపీ నేత
- చెప్పినట్టుగానే కాణిపాకం వచ్చిన విష్ణు
కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు అంశం వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డిల మధ్య వ్యక్తిగత ఆరోపణలకు దారితీసింది. విష్ణు పెద్ద దొంగ అని, పుట్టపర్తి ఆశ్రమంలో డబ్బు, బంగారం దోచేశారని రాచమల్లు ఆరోపించారు. దాంతో తాను కాణిపాకంలో సత్యప్రమాణం చేస్తానని, ఎమ్మెల్యే రాచమల్లు కూడా రావాలని విష్ణు సవాల్ చేశారు.
చెప్పినట్టుగానే విష్ణు ఇవాళ చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయానికి విచ్చేశారు. తన పర్యటన గురించి ట్విట్టర్ లో వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం కాణిపాకం వచ్చి దేవుని సన్నిధిలో సత్యప్రమాణం చేశానని విష్ణు తెలిపారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సత్య ప్రమాణం చేసేందుకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. అంటే ఆయన అవినీతి, హత్యారాజకీయాలు చేస్తున్నట్టు అంగీకరించినట్టే కదా? అని విష్ణు వ్యాఖ్యానించారు.