Hema: సినీ నటి హేమకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన 'మా' క్రమశిక్షణ సంఘం
- నరేశ్ నిధులను దుర్వినియోగం చేశారన్న హేమ
- క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేసిన నరేశ్
- మూడు రోజుల్లోగా సమాధానం చెప్పాలన్న క్రమశిక్షణ సంఘం
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు టాలీవుడ్ లో వేడి పుట్టిస్తున్నాయి. అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన వారి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ నిధులను దుర్వినియోగం చేశారంటూ హేమ ఆరోపించింది. ఈ మేరకు ఆమె మాట్లాడిన వాయిస్ రికార్డ్ కూడా బయటపడింది.
ఈ ఆరోపణలపై నరేశ్ స్పందిస్తూ... అసోసియేషన్ గౌరవాన్ని తగ్గించేలా హేమ మాట్లాడుతున్నారని అన్నారు. క్రమశిక్షణ కమిటీకి హేమపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే విషయం క్రమశిక్షణ సంఘం వద్దకు చేరింది. ఈ క్రమంలో హేమకు క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని... లేని పక్షంలో క్రమశిక్షణ సంఘం కఠిన చర్యలు తీసుకుంటుందని నోటీసుల్లో పేర్కొంది.
మరోవైపు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారు చేసుకుంటున్న విమర్శలపై చిరంజీవి కూడా స్పందించారు. సభ్యుల బహిరంగ ప్రకటనతో అసోసియేషన్ ప్రతిష్ఠ మసకబారుతుందని ఆయన అన్నారు. అసోసియేషన్ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని... లేని పక్షంలో సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయని చెప్పారు.