Vemula Prashanth Reddy: కేసీఆర్ ను తిట్టడం ద్వారా రేవంత్ శునకానందం పొందారు: మంత్రి వేముల

Telangana minister Vemula Prashant Reddy fires on Revanth Reddy

  • నిన్న ఇంద్రవెల్లి సభలో రేవంత్ ప్రసంగం
  • కేసీఆర్ పై విమర్శలు
  • తెలంగాణ మంత్రుల ప్రెస్ మీట్
  • రేవంత్ పై నిప్పులు చెరిగిన వేముల

ఇంద్రవెల్లి సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ ను తీవ్ర పదజాలంతో విమర్శించడం పట్ల తెలంగాణ మంత్రులు ఘాటుగా స్పందించారు. వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇంద్రవెల్లిలో రేవంత్ రెడ్డి నోటి తీట తీర్చుకున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ను తిట్టడం ద్వారా శునకానందం పొంది సభను ముగించారని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి చరిత్ర మర్చిపోయి మాట్లాడుతున్నారని, ఆయనను చూస్తుంటే తమకు జాలి కలుగుతోందని అన్నారు.

చంద్రబాబు భిక్షతోనే రేవంత్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యాడని, రేవంత్ ఇప్పటికీ చంద్రబాబు కనుసన్నల్లోనే నడుస్తున్నారని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. శవాలపై పేలాలు ఏరుకునే రేవంత్ రెడ్డి, రోజుకో మాట, పూటకో పార్టీ మార్చుతుంటాడని, ప్రజలు ఆయనను ఏవిధంగా నమ్మాలని ప్రశ్నించారు.

1981లో ఇంద్రవెల్లిలో ఆదివాసీ బిడ్డలను వందలమందిని పిట్టలను కాల్చినట్టు కాల్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, నాడు ఇందిరాగాంధీ హయాంలో ఈ ఘాతుకం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటిది నిన్న అదే ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ సభ ఏర్పాటు చేయడం చూస్తుంటే గుండెలు మండాయని అన్నారు. ఆనాడు గిరిజనులను చంపి ఇవాళ స్మారకం కడతారా? అని వేముల మండిపడ్డారు.

  • Loading...

More Telugu News