Ayodhya Ram Mandir: భక్తులు ఇకపై అయోధ్య రామమందిర నిర్మాణ పనులు ప్రత్యక్షంగా చూడొచ్చు!
- కీలక నిర్ణయం తీసుకున్న తీర్థక్షేత్ర ట్రస్టు
- నిర్మాణ పనులు చూసేందుకు భక్తుల ఆసక్తి
- భక్తుల కోరికను మన్నించిన ట్రస్టు
- ఆలయ పశ్చిమభాగంలో గోడ తొలగింపు
- భక్తుల వీక్షణకు ఏర్పాట్లు
అయోధ్యలో రామమందిరం నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్న శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రామమందిరం నిర్మాణ పనులు జరుగుతుండగా, ఆ పనులను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భక్తులకు అనుమతి ఇచ్చింది. రామమందిరం పనులను దగ్గర్నుంచి చూసేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.. ఆలయం పశ్చిమ భాగంలో ఓ గోడను కొంత మేర తొలగించి, అక్కడ ఇనుప గ్రిల్ ఏర్పాటు చేయనున్నారు. క్యూలైన్ల ద్వారా భక్తులు ఆ గ్రిల్ వంటి ఏర్పాట్ల ద్వారా పనులను పరిశీలించవచ్చు.
రాముడి జన్మస్థలంలో ఆయన కోసం కడుతున్న ఆలయం ఇప్పుడెంత వరకు వచ్చిందో చూడాలని పెద్ద సంఖ్యలో భక్తులు కోరుతున్నారని ట్రస్టు పేర్కొంది. వారి అభ్యర్థనల మేరకు, నిర్మాణ పనులు చూసేందుకు వారిని అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్టు ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. భక్తులు ఇప్పటివరకు ప్రధాన ఆలయ నిర్మాణానికి సమీపంలోని తాత్కాలిక ఆలయాన్ని మాత్రమే సందర్శించే వీలుంది. ఇప్పుడు తీర్థ క్షేత్ర ట్రస్టు నిర్ణయంతో భక్తుల కోరిక నెరవేరనుంది.