Algeria: అల్జీరియాలో ఘోర అగ్నిప్రమాదం.. 25 మంది సైనికులు సహా 42 మంది మృత్యువాత

Algeria Wildfires Kill 42 Authorities Blame Arson
  • కబీలీ ప్రాంతంలోని కొండలపై కార్చిచ్చు
  • 100 మందిని రక్షించిన సైన్యం
  • పశ్చిమ దేశాల్లో ఇటీవల వరుసగా కార్చిచ్చు ఘటనలు
ఆఫ్రికా దేశమైన అల్జీరియాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 25 మంది సైనికులు సహా 42 మంది సజీవ దహనమయ్యారు. ఉష్ణోగ్రతలు పెరగడం, పొడి వాతావరణం కారణంగా అడవిలో కార్చిచ్చు చెలరేగింది. ఈ ఘటనలో కనీసం 42 మంది మరణించారని అధికారులు తెలిపారు. వీరిలో 25 మంది సైనికులు కాగా, 17 మంది సాధారణ పౌరులని పేర్కొన్నారు.

 రాజధాని అల్జీర్స్‌కు తూర్పున ఉన్న కబీలీ ప్రాంతమైన కొండలపై మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగలతో ఆ ప్రాంతం కమ్ముకుపోయినట్టు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న పోస్టులు ద్వారా తెలుస్తోంది. మంటల్లో చిక్కుకున్న వందమందికిపైగా ప్రజలను సైన్యం రక్షించింది. మంటలను అదుపు చేసే క్రమంలో సైనికులు కూడా పెద్ద ఎత్తున మరణించినట్టు అధికారులు తెలిపారు. అలాగే, మరో 14 మంది సైనికులు తీవ్రంగా గాయపడినట్టు పేర్కొన్నారు.

కాగా, ఇటీవల గ్రీస్, టర్కీ, సైప్రస్, పశ్చిమ అమెరికా ప్రాంతాల్లో కార్చిచ్చు ఘటనలు వెలుగుచూశాయి. ఇప్పుడు ఆ జాబితాలో అల్జీరియా కూడా చేరింది. సైనికుల మృతిపై అల్జీరియా అధ్యక్షుడు అబ్దెల్‌మాద్జిద్ తెబ్బౌన్ సంతాపం తెలిపారు. బైజైయా, టిజీ ఓజౌ పర్వతాలలో చెలరేగిన కార్చిచ్చు నుంచి సైన్యం 100 మంది పౌరులను రక్షించిందని, ఈ క్రమంలో 25 మంది సైనికులు బలిదానం చెందినట్టు తెలిసిందని ట్వీట్ చేసిన అధ్యక్షుడు వారి మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కాగా, ఈ ఘటనకు గృహ దహనమే కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు అల్జీరియా ప్రభుత్వ రేడియో తెలిపింది.
Algeria
wildfire
soldiers
Killed
Arson

More Telugu News