APSRTC: ప్రమాదంలో కాలు కోల్పోయి మూడేళ్లుగా అవస్థలు.. డ్రైవర్ ను ఓదార్చి భరోసా ఇచ్చిన ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ!
- తితిలీ తుపాను సమయంలో కాలు కోల్పోయిన ఆర్టీసీ డ్రైవర్ కేసీహెచ్ రావు
- ఆర్థికంగా చితికిపోయిన రావు కుటుంబం
- గోడు వెళ్లబోసుకునేందుకు విజయవాడ ఆర్టీసీ హౌస్‌కు
- రావు గురించి తెలిసి చలించిపోయిన ఆర్టీసీ ఎండీ
మూడేళ్ల క్రితం వచ్చిన తితిలీ తుపాను సమయంలో గాయపడి కాలు కోల్పోయిన ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ ప్రస్తుతం దయనీయ పరిస్థితిలో ఉన్నాడు. కాలు కోల్పోవడంతో ఉద్యోగానికి దూరమయ్యాడు. దీంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. విషయం తెలిసిన ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ స్వయంగా ఓదార్చారు. తానున్నానంటూ భరోసా ఇచ్చారు.
కేసీహెచ్ రావు శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీసీ డిపోలో డ్రైవర్. తితిలీ తుపాను కారణంగా మూడేళ్ల క్రితం కాలు కోల్పోయిన రావు కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. కరోనా వారి కష్టాలను మరింత పెంచింది. దీంతో తన గోడు వెళ్లబోసుకునేందుకు రావు ఇటీవల విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌కు వచ్చారు.
అర్జీ చేతపట్టుకుని వేచి చూస్తున్న రావును సీసీ కెమెరా ద్వారా చూసిన ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సెక్యూరిటీ సిబ్బందిని పిలిచి ఆయన గురించి ఆరా తీశారు. విషయం తెలిసి కదిలిపోయారు. బయటకు వచ్చి రావును కలిసి మాట్లాడారు. కాలు లేకపోవడంతో తాను ఇక ఉద్యోగం చేయలేనని, ‘బ్రెడ్ విన్నర్’ పథకం కింద తన కుమారుడికి ఉద్యోగం ఇస్తే కుటుంబానికి ఆసరా లభిస్తుందని రావు వేడుకున్నారు. చలించిపోయిన ఎండీ.. వెంటనే ఆయన అర్జీని తీసుకుని వెంటనే ఫైలును సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. స్వయంగా ఎండీనే వచ్చి ఓదార్చడంతో రావు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.