Hyderabad: అమ్మాయి వలపు వలకు రూ. 24 లక్షలు సమర్పయామి.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కొంపముంచిన వీడియో కాల్
- అమ్మాయి వలపు వలలో చిక్కుకుని విలవిల్లాడిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
- న్యూడ్‌గా కాల్‌చేసి అడ్డంగా బుక్కైన యువకుడు
- లక్షల రూపాయలు ఇచ్చినా ఆగని వేధింపులు
- హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన దంపతుల అరెస్ట్
అమ్మాయి విసిరిన వలపు వలలో చిక్కుకున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అందులోంచి బయట పడేందుకు ఏకంగా రూ. 24 లక్షలు సమర్పించుకున్నాడు. అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. విశాఖపట్టణం జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. వేపగుంటకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు గతేడాది నవంబరు 6న కవ్వించే ఓ మెసేజ్ వచ్చింది.
‘కాల్ మీ ఎనీటైమ్. ఐయామ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ టు టాక్’ అని ఉన్న ఆ మెసేజ్‌లో 55678557 నంబరుకు కాల్ చేయాలని ఉంది. అది చూసిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉత్సాహం ఆపుకోలేక ఆ నంబరుకు కాల్ చేశాడు. అటునుంచి ఓ అమ్మాయి మత్తెక్కించేలా మాట్లాడుతూ న్యూడ్‌గా వీడియో కాల్ చేయమని కోరింది. క్షణం కూడా ఆలోచించకుండా ఆమె అడిగిందే తడవుగా వీడియో కాల్ చేశాడు. ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే న్యూడ్ వీడియో కాల్ చేసి ఇద్దరూ మాట్లాడుకున్నారు.
ఆ తర్వాత యువకుడికి కష్టాలు మొదలయ్యాయి. న్యూడ్ వీడియో కాల్ స్క్రీన్‌షాట్లు పంపిన ఆ యువతి డబ్బుల కోసం డిమాండ్ చేసింది. డబ్బులు ఇవ్వకుంటే వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరించింది. ఈ క్రమంలో మరో ఇద్దరు వ్యక్తులు రంగంలోకి దిగి అతడిని బెదిరించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాకు ఎక్కితే తన పరువు పోతుందని భయపడిన బాధితుడు పలు దఫాలుగా వారు అడిగినంత చెల్లించుకున్నాడు. మొత్తంగా రూ. 24 లక్షలు సమర్పించుకున్నాడు. అయినప్పటికీ వారి నుంచి వేధింపులు ఆగకపోవడంతో జులై 16న సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసి తన గోడు వెళ్లబోసుకున్నాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు బ్యాంకు ఖాతాల ఆధారంగా ముగ్గురు నిందితులను గుర్తించారు. కృష్ణా జిల్లా దబ్బకుపల్లికి చెందిన షేక్ అబ్దుల్ రహీం (30), జీడిమెట్లకు చెందిన దంపతులు గుండా జ్యోతి (28), గుండీ వీర సతీష్ (34)లు హైదరాబాద్ కేంద్రంగా ఈ మోసానికి పాల్పడినట్టు గుర్తించారు. వెంటనే హైదరాబాద్ చేరుకుని వారిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 3.5 లక్షల నగదు, ల్యాప్‌టాప్, 8 మొబైల్ ఫోన్లు, 3 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కోర్టు వీరికి 14 రోజుల రిమాండ్ విధించింది.