Prime Minister: రిటైర్మెంట్​ వయసు పెంచండి: ప్రధాని ఆర్థిక సలహా మండలి నివేదిక

PMs Economic Advisory Council Recommends To Raise Retirement Age

  • వృద్ధులకూ పని అవకాశం కల్పించినట్టవుతుంది
  • జీవితకాలం మరింత పెరిగే అవకాశం
  • 50 నుంచి 60 ఏళ్ల వారిలో నైపుణ్యాలు పెంచండి

దేశంలో ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి సూచించింది. దేశంలో పనిచేసే యువతరం ఎక్కువగా ఉందని, రాబోయే రోజుల్లో జీవిత కాలం పెరిగే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్న ఆర్థిక సలహా మండలి.. వయసైపోయినవారూ మరింత కాలం పనిచేసేలా అవకాశం కల్పించాలని సూచించింది.

అయితే, పదవీ విరమణ వయసును దశల వారీగానే పెంచాలని సూచించింది. రిటైర్మెంట్ వయసును పెంచడం వల్ల వృద్ధులకూ పని అవకాశాలు కల్పించినట్టవుతుందని నివేదికలో వెల్లడించింది. రిటైర్మెంట్ వయసు పెంచినా ప్రస్తుతం అవసరమైన ఉద్యోగుల సంఖ్యను తగ్గించకూడదని, నియామకాలు ఆపొద్దని సూచించింది. దీని వల్ల సామాజిక భద్రతపై ఒత్తిడి పడదని తెలిపింది. అయితే, అది అంత సులువు మాత్రం కాదని స్పష్టం చేసింది.

50 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న ఉద్యోగుల్లో నైపుణ్యాలను మెరుగపరిచేలా శిక్షణనివ్వాలని నివేదికలో సూచించింది. అందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధివిధానాలను రూపొందించాలని తెలిపింది. అసంఘటిత రంగంలోని కార్మికులు, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని ఉద్యోగులు, మైనారిటీలు, శరణార్థులు, వలసదారుల వంటి వారికీ శిక్షణలో అవకాశం కల్పించాలని, వారిని వదిలేయొద్దని సూచన చేసింది.

  • Loading...

More Telugu News