Vinod K Dasari: రాయల్ ఎన్ ఫీల్డ్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకున్న వినోద్ కె దాసరి
- రాయల్ ఎన్ ఫీల్డ్ కు గుడ్ బై చెప్పిన వినోద్
- కొత్త చీఫ్ గా గోవిందరాజన్
- ఇప్పటిదాకా సీఓఓగా వ్యవహరించిన గోవిందరాజన్
- వినోద్ వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారన్న ఐషర్
ద్విచక్రవాహన తయారీ దిగ్గజం రాయల్ ఎన్ ఫీల్డ్ పాలకవర్గంలో కీలక మార్పు చోటుచేసుకుంది. రాయల్ ఎన్ ఫీల్డ్ సీఈఓగా వినోద్ కె దాసరి తప్పుకున్నారు. అదే సమయంలో రాయల్ ఎన్ ఫీల్డ్ మాతృసంస్థ ఐషర్ మోటార్స్ లోనూ ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవి నుంచి వైదొలిగారు. ఈ మేరకు ఐషర్ మోటార్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మార్పు ఆగస్టు 13 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది.
వినోద్ కె దాసరి స్థానంలో రాయల్ ఎన్ ఫీల్డ్ సీఈఓ బాధ్యతలను బి.గోవిందరాజన్ చేపడతారని ఆ ప్రకటనలో ఐషర్ మోటార్స్ పేర్కొంది. ఐషర్ మోటార్స్ బోర్డులో గోవిందరాజన్ ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గానూ నియమిస్తున్నట్టు తెలిపింది. ఆగస్టు 18 నుంచి గోవిందరాజన్ నియామకం అమల్లోకి వస్తుందని వెల్లడించారు. రాయల్ ఎన్ ఫీల్డ్ నూతన సారథి గోవింద్ రాజన్ 2013 నుంచి సంస్థలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.
వినోద్ కె దాసరి వ్యక్తిగత కారణాలతో తన పదవీకాలాన్ని ముగించాలని నిర్ణయించుకున్నారని ఐషర్ మోటార్స్ స్పష్టం చేసింది. వినోద్ కె దాసరి ఇకపై ఆరోగ్య రంగంలో కాలుమోపనున్నారని, అందరికీ అందుబాటులో మెరుగైన ఆరోగ్య వ్యవస్థలను తీసుకువచ్చేందుకు కృషి చేయనున్నారని ఐషర్ మోటార్స్ తన ప్రకటనలో వివరించింది. వినోద్ కె దాసరి గతంలో అశోక్ లేలాండ్ సంస్థకు ఎండీగా వ్యవహరించారు.