Rahul Gandhi: తన ట్విట్టర్ ఖాతాను లాక్ చేయడంపై రాహుల్ గాంధీ స్పందన
- ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది
- పార్లమెంటులోనూ మాట్లాడేందుకు అనుమతి ఇవ్వట్లేదు
- మీడియానూ నియంత్రిస్తున్నారు
- కేంద్ర ప్రభుత్వం ఏది చెబితే ట్విట్టర్ అదే వింటోంది
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను తాత్కాలికంగా లాక్ చేస్తూ ఆ సామాజిక మాధ్యమ సంస్థ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో జరిగిన తొమ్మిదేళ్ల బాలిక హత్యాచార ఘటనకు సంబంధించి ఆమె తల్లిదండ్రుల వివరాలను వెల్లడించడం వల్లే ఆయన ట్విట్టర్ ఖాతాను లాక్ చేసినట్లు వివరించింది. అయితే, దీనిపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ మండిపడ్డారు.
ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని రాహుల్ అన్నారు. పార్లమెంటులోనూ మాట్లాడేందుకు తమకు అనుమతి ఇవ్వట్లేదని, మీడియానూ నియంత్రిస్తున్నారని చెప్పారు. కనీసం ట్విట్టర్లోనైనా మన ఆలోచనలు పంచుకునేందుకు అవకాశం ఉందని భావించామని, కానీ, ఆ సామాజిక మాధ్యమం కూడా కేంద్ర ప్రభుత్వం ఏది చెబితే అదే వింటోందని ఆయన విమర్శించారు. ట్విట్టర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.