Dr Bhaskar Rao: కోలుకున్న ప్రకాశం జిల్లా వైద్యుడు.... సీఎం జగన్ మూర్తీభవించిన మానవతావాది అంటూ విజయసాయి వ్యాఖ్యలు
- ఇటీవల కరోనా బారినపడిన డాక్టర్ భాస్కర్ రావు
- భాస్కర్ రావు ప్రకాశం జిల్లా కారంచేడు వైద్యుడు
- రెండు ఊపిరితిత్తులు దెబ్బతిన్న వైనం
- రూ.2 కోట్లు మంజూరు చేసిన సీఎం జగన్
ఇటీవల ప్రకాశం జిల్లా కారంచేడు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు భాస్కర్ రావు కరోనా బారినపడడంతో ఆయన రెండు ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. ఊపిరితిత్తులు మార్చితేనే ఆయన బతుకుతాడని వైద్యులు తెలపడంతో ఏపీ సీఎం జగన్ ఎంతో ఉదారంగా స్పందించారు. డాక్టర్ భాస్కర్ రావు ఊపిరితిత్తుల మార్పిడికి రూ.2 కోట్లు మంజూరు చేశారు. కాగా, ప్రభుత్వ సాయంతో ఆ వైద్యుడికి ఊపిరితిత్తుల మార్పిడి విజయవంతం అయిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా వెల్లడించారు.
"సీఎం జగన్ అంటేనే భరోసా. సీఎం జగన్ అంటే మూర్తీభవించిన మానవత్వం. కరోనా రోగులకు చికిత్స చేసే క్రమంలో డాక్టర్ భాస్కర్ రావు ఆ మహమ్మారి బారినపడ్డారు. ఆయన రెండు ఊపిరితిత్తులు దెబ్బతినగా, చికిత్స ఖర్చు దాదాపు రూ.2 కోట్లు సీఎం ఆదేశాలతో ప్రభుత్వమే భరించింది. ఇప్పుడు లంగ్స్ మార్పిడి చికిత్స విజయవంతమై డాక్టర్ భాస్కర్ రావు కోలుకున్నారు" అని సోషల్ మీడియాలో వివరించారు.