India: లార్డ్స్ లో రెండో రోజు ఆట ప్రారంభం... వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన భారత్
- భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు
- తొలిరోజు భారత్ 276/3
- కేఎల్ రాహుల్ సెంచరీ
- రెండో రోజు తొలి ఓవర్లోనే రాహుల్ అవుట్
- కాసేపటికే వెనుదిరిగిన రహానే
లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండోరోజు ఆట ప్రారంభమైంది. ఓవర్ నైట్ స్కోరు 276-3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. తొలిరోజు సెంచరీ హీరో కేఎల్ రాహుల్ రెండో రోజు ఆటలో తొలి ఓవర్లోనే వెనుదిరిగాడు. తన ఓవర్ నైట్ స్కోరు 127 పరుగులకు మరో 2 పరుగులు జోడించి 129 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. ఈ వికెట్ రాబిన్సన్ ఖాతాలో చేరింది.
ఆ తర్వాత అజింక్యా రహానే కూడా క్రీజులో ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఆండర్సన్ బౌలింగ్ లో స్లిప్స్ లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 96 ఓవర్లలో 5 వికెట్లకు 287 పరుగులు. క్రీజులో రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఉన్నారు. కాగా, రెండో రోజు ఆట సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్లు రూత్ స్ట్రాస్ ఫౌండేషన్ కు మద్దతుగా ఎర్ర టోపీలు ధరించారు.