Unmukt Chand: 28 ఏళ్లకే ఆటకు వీడ్కోలు పలికిన భారత క్రికెటర్
- భారత్ లో కెరీర్ ముగించిన ఉన్ముక్త్ చంద్
- 2012 అండర్-19 వరల్డ్ కప్ నెగ్గిన భారత్
- నాటి భారత జట్టుకు ఉన్ముక్త్ సారథ్యం
- ఆపై కెరీర్ లో వెనుకబడిన వైనం
- తాజాగా విదేశీ లీగ్ లపై దృష్టి
భారత్ లో క్రికెట్ ఓ మతం. అది సీనియర్ లెవల్ అయినా, జూనియర్ క్రికెట్ అయినా విజయం సాధిస్తే ఓ రేంజిలో సంబరాలు చేస్తుంటారు. 2012లో భారత జట్టు అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ గెలవగానే, ఆ జట్టుకు స్వదేశంలో అపూర్వ ఆదరణ లభించింది. ఆ టీమ్ సారథి ఉన్ముక్త్ చంద్ 19 ఏళ్లకే సెలబ్రిటీ అయిపోయాడు. భవిష్యత్తులో టీమిండియా స్టార్ అవుతాడని, భారత సీనియర్ జట్టును నడిపిస్తాడని నాడు క్రికెట్ పండితులు అభిప్రాయపడ్డారు. కానీ, అవేవీ జరగలేదు.
ఉన్ముక్త్ చంద్ ప్రతిభ దేశవాళీ క్రికెట్ వరకే పరిమితమైంది. 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, 2014 టీ20 వరల్డ్ కప్ సందర్భంగా భారత ప్రాబబుల్స్ జాబితాలో స్థానం లభించినా, తుదిజట్లలో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ఓ దశలో ఇండియా-ఏ సారథ్యం కూడా దక్కినా, అది కూడా కొద్దికాలమే. ఓవరాల్ గా తన కెరీర్ లో ఎక్కువభాగం ఢిల్లీ తరఫున దేశవాళీ క్రికెట్ లో కొనసాగాడు. ఐపీఎల్ లోనూ కొద్దిమేర మాత్రమే కనిపించాడు.
తాజాగా, ఆటకు గుడ్ బై చెబుతున్నట్టు ఉన్ముక్త్ చంద్ ప్రకటించాడు. ఇకపై ప్రపంచవ్యాప్తంగా జరిగే క్రికెట్ లీగ్ లలో పాల్గొంటానని వెల్లడించాడు. భారత్ లో ఆటకు రిటైర్మెంటు ప్రకటించడం వల్ల తాను మాజీ ఆటగాడ్ని అవుతానని, తద్వారా విదేశీ లీగ్ పోటీల్లో ఆడేందుకు అడ్డంకులు ఉండబోవని వివరించాడు. ఇంతజేసీ ఉన్ముక్త్ చంద్ వయసు 28 ఏళ్లే. ఈ వయసుకు చాలామంది క్రికెటర్లు జాతీయ జట్లలో అరంగేట్రం చేస్తుంటారు. అలాంటిది, ఉన్ముక్త చంద్ తనకు మరిన్ని అవకాశాలు రావాలంటే రిటైర్మెంట్ ప్రకటించడం తప్పనిసరి అంటున్నాడు.
ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ కాకుండా బిగ్ బాష్ లీగ్ (ఆస్ట్రేలియా), సీపీఎల్ (వెస్టిండీస్), బంగ్లా ప్రీమియర్ లీగ్ (బంగ్లాదేశ్), పీఎస్ఎల్ (పాకిస్థాన్) టోర్నీలు వివిధ దేశాల ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తున్నాయి.