Galla Ramachandra Naidu: అందుబాటులో ఉన్న వనరులతోనే ఎదగాలనుకున్నాం: గల్లా రామచంద్రనాయుడు
- తిరుపతిలో మీడియా సమావేశం
- తమ ప్రస్థానంలో అనేక మెట్లు ఎక్కామని వెల్లడి
- చిన్నప్పుడు తమ ఊరే ప్రపంచమని వివరణ
- తండ్రి, మేనమామల ప్రస్తావన
అమరరాజా సంస్థల వ్యవస్థాపకుడు గల్లా రామచంద్రనాయుడు తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రామచంద్రనాయుడు మాట్లాడుతూ, పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు అనేక మెట్లు ఎక్కామని, అందుబాటులో ఉన్న వనరులతోనే ఎదగాలని భావించామని తెలిపారు. బాల్యంలో పశువులు కాసే సమయంలో ప్రపంచం చాలా పెద్దదన్న విషయం తెలిసిందని, ఇప్పటివరకు తమ ఊరే తమకు ప్రపంచం అని పేర్కొన్నారు. చదువుకోవాలన్న కోరికకు అప్పుడే బీజం పడిందని వివరించారు.
తన తండ్రి నుంచి చొరవ, తెగువ వారసత్వంగా తనకు లభించాయని రామచంద్రనాయుడు వెల్లడించారు. తన తండ్రికి చదువు రాకపోయినా, ఎంతో తెలివైనవాడని పేర్కొన్నారు. వ్యవసాయాధారిత ఉపాధి క్రమంగా తగ్గుతున్న విషయం గుర్తించామని, భారతదేశంలో పల్లెల్లో అత్యధికులు అవకాశాల లేమితో బాధపడుతున్నవారేనని, అలాంటి వారికి ఏమైనా చేయూతనివ్వాలని భావించామని వెల్లడించారు. యువతకు వివిధ రకాల ఉపాధి అవకాశాలు కల్పించాలనేది తమ లక్ష్యమని తెలిపారు.
తన తండ్రి తర్వాత తనను అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి మేనమామ సీపీ రాజగోపాలనాయుడు అని, ఆయన నుంచి కూడా అనేక అంశాలు నేర్చుకున్నానని చెప్పారు. తన మేనమామ ఎప్పుడూ పల్లెలు, రైతులు, కూలీల గురించి ఆలోచిస్తుండేవారని తెలిపారు. పల్లె ప్రజలకు ఏదైనా చేయాలన్న దానికి తన తండ్రి, మేనమామలే తనకు స్ఫూర్తి అని స్పష్టం చేశారు.
1985లో తాము తిరుపతి వచ్చామని, ఆ సమయంలో ప్రతిదానికి ఢిల్లీ వెళ్లి లైసెన్స్ తీసుకోవాల్సి వచ్చేదని రామచంద్రనాయుడు తెలిపారు. అయితే ఎన్టీఆర్ విధానాలతో కొన్ని విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. 18 ఏళ్లు అమెరికాలో ఉండి భారత్ తిరిగొచ్చానని, ఆపై తమ పారిశ్రామిక ప్రస్థానంలో అంచెలంచెలుగా ఎదిగామని వివరించారు.
పరిశ్రమ స్థాపనకు వ్యవసాయ సాగుభూమి వాడరాదని నిబంధన పెట్టుకున్నామని, ఈ క్రమంలో పిచ్చి మొక్కలతో నిండిన భూమిని పచ్చదనంతో నింపామని రామచంద్రనాయుడు వెల్లడించారు. 1985లో చిన్నగ్రామం కరకంబాడిలో పరిశ్రమను విస్తరించామని, అనంతరం తమ స్వగ్రామం పేటమిట్టలో పరిశ్రమ స్థాపించామని వివరించారు. అక్కడ్నించి అమరరాజా పరిశ్రమది 36 ఏళ్ల ప్రయాణమని తెలిపారు.