Dasoju Sravan: కేసీఆర్ ఎప్పటికీ దళిత బంధువు కాలేరు: దాసోజు శ్రవణ్
- ఉపఎన్నిక కోసమే పథకం తెచ్చారన్న శ్రవణ్
- ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఖర్చు చేయలేదని ఆరోపణ
- నిధులు ఖర్చు చేస్తే దళితబంధు అవసరంలేదని వెల్లడి
- టీఆర్ఎస్ ను వదిలేది లేదని వ్యాఖ్యలు
కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కేసీఆర్ ఎప్పటికీ దళిత బంధువు కాలేరని విమర్శించారు. ఏడేళ్లలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద రూ.65 వేల కోట్లు కేటాయిస్తే, ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయలేదని ఆరోపించారు. ఆ నిధులు ఖర్చు చేసి ఉంటే ఇప్పుడు దళిత బంధు తీసుకురావాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకునే దళిత బంధు పేరుతో కొత్త డ్రామాకు తెరదీశారని మండిపడ్డారు.
ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ నిర్వహించిన ఆత్మగౌరవ దండోరా సభ విజయవంతం కావడంతో టీఆర్ఎస్ లో కదలిక వచ్చిందని అన్నారు. ఆ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని స్పష్టం చేశారు. హుజూరాబాద్ లో ఓటమి ఖాయమని తెలియడంతో, కరోనా అంశాన్ని తెరపైకి తెచ్చి ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.