AP DGP: ఏపీ గవర్నర్, డీజీపీలను కలిసిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
- టోక్యో ఒలింపిక్స్ లో సింధుకు కాంస్యం
- సింధుపై అభినందనల వెల్లువ
- సింధును సన్మానించిన గవర్నర్, డీజీపీ
- ఏపీ సర్కారును కొనియాడిన సింధు
టోక్యో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ అంశంలో కాంస్యం సాధించిన తెలుగుతేజం పీవీ సింధు దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసింది. సింధు ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడమే కాకుండా, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ లను కలిసింది. వరుసగా రెండు ఒలింపిక్స్ లో పతకాలు గెలిచిన తొలి భారత మహిళా అథ్లెట్ గా సింధు చరిత్ర సృష్టించిందని గవర్నర్ కొనియాడారు. సింధు తల్లిదండ్రులిద్దరూ క్రీడాకారులే కావడంతో సహజంగానే ఆమె క్రీడానైపుణ్యాన్ని అందిపుచ్చుకుందని పేర్కొన్నారు.
ఇక డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా సింధును శాలువా కప్పి సత్కరించారు. సింధు సాధించింది కేవలం పతకం మాత్రమే కాదని, అది దేశానికి గర్వకారణం అని తెలిపారు. సింధు ప్రపంచస్థాయిలో పతకం సాధించడం ఏపీకి దక్కిన గౌరవం అని సవాంగ్ పేర్కొన్నారు. ఆమె సాధించిన విజయం మహిళలు, యువతకు స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. సింధు రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.
సింధు స్పందిస్తూ, మహిళల కోసం ఏపీ ప్రభుత్వం, పోలీస్ శాఖ ఎంతో కృషి చేస్తున్నాయని కొనియాడింది. ప్రత్యేకించి దిశ యాప్ ను తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. ప్రతి మహిళ దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సింధు పిలుపునిచ్చింది.