afghanistan: తాలిబన్ల అరాచకాలతో ఆఫ్ఘన్ వీడుతోన్న వారికి ఆశ్రయం ఇస్తున్నాం: కెనడా కీలక ప్రకటన
- 20 వేల మంది శరణార్థులకు ఆశ్రయం
- మహిళా నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు రావచ్చు
- మా దేశం మౌనంగా ఉండదు
ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సహా ఇతర నాటో దళాలు వెనక్కి వెళ్తుండడంతో ఆఫ్ఘన్లో తాలిబన్లు రెచ్చిపోతోన్న విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లో ఆఫ్ఘన్ మొత్తం తాలిబన్ల వశం అవుతుందని అంచనాలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘన్‌కు చెందిన 20 వేల మంది శరణార్థులకు తమ దేశంలో ఆశ్రయం కల్పించనున్నట్లు తెలిపింది. ఆఫ్ఘన్‌కు చెందిన మహిళా నేతలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఆశ్రయం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆ దేశంలో ప్రస్తుతం పరిస్థితులు క్షీణించిపోయాయని తెలిపింది.
ఇటువంటి సమయంలో తమ దేశం మౌనంగా ఉండలేదని కెనడా మంత్రి మార్కో మెడిసినో అన్నారు. తాలిబన్ల అరాచకాల వల్ల ఆఫ్ఘన్ నుంచి వెళ్లిపోతోన్న మానవహక్కుల నేతలు, మైనార్టీలు, జర్నలిస్టుల వంటి వారికి తమ దేశం ఆశ్రయం ఇస్తుందని చెప్పారు. ఇప్పటికే ఏడు విమానాల్లో శరణార్థుల తరలింపు ప్రారంభమైందని వివరించింది.
తొలి విమానం తమ దేశంలో ల్యాండ్ అయినట్లు చెప్పారు. ఇప్పటికే అనేక కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న ఉగ్రవాదులు కాబూల్ నూ చుట్టుముట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆ దేశంలోని తమ రాయబార కార్యాలయ సిబ్బందిని తమ దేశానికి తరలిస్తున్నట్లు కెనడా తెలిపింది. ఇతర దేశాలు కూడా ఇదే పని చేస్తున్నాయి.