Mahatma Gandhi: భారత జాతిపిత గాంధీకి అమెరికా అత్యున్నత పురస్కారం... ప్రతినిధుల సభలో తీర్మానం
- భారత స్వాతంత్ర్యానికి 75 ఏళ్లు
- అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- ప్రతిపాదన చేసిన కరోలిన్ బి. మలోనీ
- సత్యాగ్రహ మార్గానికి ఆద్యుడు అంటూ కితాబు
అమెరికాలో కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ ను అత్యున్నత పౌరపురస్కారంగా భావిస్తారు. ఈ అవార్డును భారత జాతిపిత మహాత్మాగాంధీకి మరణానంతరం ప్రదానం చేయాలంటూ అమెరికా చట్టసభ సభ్యురాలు కరోలిన్ బి. మలోనీ దిగువసభలో తీర్మానం చేశారు. ఆగస్టు 15న భారత స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ఆమె ఈ మేరకు ప్రతినిధుల సభలో ప్రతిపాదన చేశారు. కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ ను అందుకున్నవారిలో నెల్సన్ మండేలా, జార్జి వాషింగ్టన్, మదర్ థెరిసా, రోసా పార్క్స్, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వంటి ప్రపంచ ప్రముఖులు ఉన్నారు.
తీర్మానం ప్రవేశపెట్టే సందర్భంలో కరోలిన్ బి. మలోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సత్యాగ్రహ పంథాకు ఆద్యుడు, ప్రపంచవ్యాప్త ప్రముఖులకు స్ఫూర్తిప్రదాత గాంధీ అని కొనియాడారు. వర్ణ సమానత్వం, వర్ణ వివక్ష పోరాట యోధులు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, నెల్సన్ మండేలా వంటి వారికి గాంధీ ప్రవచించిన సత్యాగ్రహ మార్గమే ప్రేరణ అని వివరించారు. సమాజంలో చూడాలని కోరుకుంటున్న మార్పును ముందుగా మనలోనే చూద్దాం అన్న గాంధీ హితోక్తిని ప్రతి ఒక్కరం పాటించాలని ఆమె సూచించారు.