Rohit Sharma: టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓపెనర్ గా రోహిత్ రికార్డ్!
- అత్యుత్తమ బ్యాటింగ్ సగటు నమోదు
- 61.25 సగటుతో బెస్ట్ ఓపెనర్ గా పేరు
- 13 ఇన్నింగ్స్ లలో 1150 పరుగులు
క్రికెట్ కంటూ ఓ ప్రమాణాన్ని నిర్దేశిస్తున్నది టెస్ట్ మ్యాచ్. అలాంటి మ్యాచ్ లలో ద బెస్ట్ ఎవరంటే ఠక్కున డాన్ బ్రాడ్ మన్ అని చెప్పేయొచ్చు. ఎందుకంటే, ఆ లెజెండ్ బ్యాటింగ్ సగటు 99.94 మరి. ఈ ఆస్ట్రేలియా ఆటగాడు 52 టెస్టులు (80 ఇన్నింగ్స్)లలో 6,996 పరుగులు చేశాడు. 334 బెస్ట్ స్కోర్. పది మ్యాచ్ లలో నాటౌట్ గా నిలిచాడు.
అయితే, ఓపెనర్ల విషయానికి వస్తే మాత్రం మన భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. మంచి బ్యాటింగ్ సగటుతో దూసుకుపోతున్నాడు. ప్రపంచంలోనె టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఓపెనర్ గా అత్యుత్తమ బ్యాటింగ్ సగటును నమోదు చేశాడు. 41 మ్యాచ్ (69 ఇన్నింగ్స్)లలో అతడు 2,810 పరుగులు చేశాడు. అయితే, ఓపెనర్ గా మారాక అతడి జోరు పెరిగింది. ఓపెనర్ గా 13 ఇన్నింగ్స్ లే ఆడిన రోహిత్.. 1150 పరుగులు చేశాడు. 61.25 సగటుతో నిలిచి రికార్డు సృష్టించాడు.
ఇప్పటిదాకా ఏ టీమ్ కైనా ఓపెనర్ గా ఇదే అత్యుత్తమ బ్యాటింగ్ సగటు. అంతకుముందు ఇంగ్లండ్ కు చెందిన మాజీ క్రికెటర్ హెర్బర్ట్ సట్ క్లిఫ్ (54 మ్యాచ్లు, 84 ఇన్నింగ్స్ లు.. 4,555 పరుగులు) 61.11 సగటుతో ముందున్నాడు. అతడిని రోహిత్ దాటేసుకుని ముందుకెళ్లాడు. కాగా, ప్రస్తుతం ఇంగ్లండ్ తో జరుగుతున్న సిరీస్ లో రోహిత్ ఫాంలో ఉన్నాడు.