Pawan Kalyan: ప్రజల సొమ్ముతో ఇచ్చే పథకాలకు మీ పేర్లు ఎందుకు?: పవన్ కల్యాణ్

Pawan Kakyan attends Independence day celebrations at Mangalagiri

  • నేడు స్వాతంత్ర్య దినోత్సవం
  • మంగళగిరి జనసేన కార్యాలయంలో వేడుక
  • హాజరైన పవన్ కల్యాణ్
  • రాజకీయ విమర్శలతో ప్రసంగం

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. రాజకీయ నేతలు అంటే పేకాట క్లబ్బులు నడిపేవారు, సూట్ కేసు కంపెనీలతో కోట్లు దోచుకునేవారు కాదని వ్యాఖ్యానించారు. స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తితో భావితరాల కోసం పనిచేసే కొత్త తరం యువత రాజకీయాల్లోకి రావాలని జనసేన పార్టీ కోరుకుంటోందని తెలిపారు.  

ఇప్పటికాలంలో కిరీటం ఒక్కటే తక్కువ అని,  ప్రస్తుత రాజకీయాలు రాచరికపు వ్యవస్థను తలపిస్తున్నాయని, రాజకీయం అంటే వారి ఇళ్లలో పిల్లలకు వారసత్వంగా కట్టబెట్టడం అన్నట్టుగా తయారైందని విమర్శించారు. నాటి నాయకులు జమీందారీ వ్యవస్థ నుంచి వచ్చి సర్వస్వం అర్పిస్తే, ఈతరం నాయకులు ప్రజల ఉమ్మడి ఆస్తులు కొల్లగొట్టి, తమ ఆస్తులు పెంచుకుంటున్నారని ఆరోపించారు. పాతతరం నాయకుల స్ఫూర్తిని బయటికి తీసుకువచ్చేందుకు జనసేన సరికొత్త యువతరం నాయకత్వానికి అవకాశం ఇస్తోందని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

ఈ స్వతంత్ర దినోత్సవ సమయాన తాను కోరుకునేది ఒక్కటేనని, స్త్రీకి భద్రత ఉన్న సమాజం కావాలని అభిలషించారు. యువతకు వారి భవిష్యత్ నిర్మించుకోగలిగే వ్యవస్థ కావాలని, విద్యావ్యవస్థ వారి కాళ్లపై వారు నిలబడగలిగేలా సత్తా ఇచ్చేదిగా ఉండాలని ఆకాంక్షించారు. మీరు ఇచ్చే రూ.5 వేల జీతానికి వలంటీర్లు గానో, సిమెంటు ఫ్యాక్టరీల్లో పనిచేసేందుకో వారి చదువులు పనికొచ్చేట్టయితే అలాంటి విద్యావ్యవస్థ సరిపోదని అన్నారు. లక్షలు ఆర్జించే, వ్యాపారాలు నిర్మించే సామర్థ్యం అందించగల విద్యావ్యవస్థ కావాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వ పథకాలకు సీఎంల పేర్లు పెట్టుకుంటున్నారని, లేకపోతే వాళ్ల కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకుంటున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. వాళ్లెవరూ దేశం కోసం పనిచేయలేదని, వాళ్ల పార్టీల బాగు కోసమే పనిచేశారని వివరించారు. "మన సంపాదన పన్నుల రూపంలో కడితే పథకాలకు వాళ్ల పేర్లు పెట్టుకుంటున్నారు. సంపాదన మనది, పేరు వారిది. ఆ పథకాలకు పొట్టి శ్రీరాములు, ప్రకాశం పంతులు వంటి జాతీయ నాయకుల పేర్లు ఎందుకు పెట్టరు? జనసేన పార్టీ అధికారంలోకి వస్తే పథకాలకు జాతీయ నేతల పేర్లు పెడతాం" అని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News