Lebanon: పేలిన ఇంధన ట్యాంక్.. 22 మంది మృతి, వందలాది మంది ఆచూకీ గల్లంతు!
- లెబనాన్ లో భారీ ప్రమాదం
- జనానికి ఫ్రీగా ఇంధనం ఇస్తున్న ఆర్మీ
- వందలాది మంది అక్కడకు చేరుకున్న వైనం
- ప్రమాద తీరుపై రకరకాల వాదనలు
లెబనాన్ పోర్టులో భారీ పేలుడు సంభవించిన కొన్ని నెలల్లోనే మరో భారీ పేలుడు సంభవించింది. దేశంలోని అత్యంత పేద ప్రాంతమైన అక్కర్ రీజియన్ లోని ఆల్తాలిల్ లో ఇవాళ ఉదయం ఇంధన ట్యాంక్ పేలింది. ఈ ఘటనలో 22 మంది చనిపోయారు. మరో 79 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొంత మంది ఆచూకీ తెలియకుండా పోయింది. ట్యాంక్ పేలినప్పుడు దాని పక్కనే వందలాది మంది ఉన్నట్టు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి చెప్పాడు.
బ్లాక్ మార్కెట్ దందాకు పాల్పడుతున్న వారి దగ్గర్నుంచి సైనికాధికారులు ఓ చమురు ట్యాంక్ ను స్వాధీనం చేసుకున్నారని, ఆ ట్యాంక్ లోని ఇంధనాన్ని జనానికి పంచుతుండగా భారీ పేలుడు సంభవించిందని అధికారులు చెబుతున్నారు. ఘటన జరిగినప్పుడు ఆ ప్రాంతంలో 200 మంది దాకా ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదముందని అధికారులు అంటున్నారు.
కాగా, బాధితులకు లెబనాన్ వైద్యులు చికిత్స చేయలేనంత తీవ్రమైన కాలిన గాయాలయ్యాయని, వారికి మెరుగైన చికిత్సను అందించేందుకు విదేశాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని దేశ ఇన్ చార్జి ఆరోగ్య శాఖ మంత్రి హమద్ హసన్ చెప్పారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.
ఇంధనం కోసం భారీగా జనం తరలి వచ్చారని, ఈ క్రమంలో ఇంధనం కోసం జరిగిన గొడవలో కాల్పులు జరిగాయని, ఓ బుల్లెట్ ఇంధన ట్యాంకుకు తగిలి పేలిందని ఓ అధికారి చెప్పారు. మరో ప్రత్యక్ష సాక్షి మాత్రం ఓ వ్యక్తి లైటర్ వెలిగించడంతోనే ప్రమాదం జరిగిందని చెప్పారు. పేలిన ట్యాంకు పక్కనే వందలాది మంది నిలబడ్డారని, వారందరికీ ఏమైందో ఆ దేవుడికే తెలియాలని ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి చెప్పారు.