Kapil Sibal: యువనేతలు పార్టీని వీడుతుంటే.. అదేమిటో మమ్మల్ని నిందిస్తారు: కాంగ్రెస్‌పై కపిల్ సిబల్ ఫైర్
- పార్టీకి సుస్మితా దేవ్ రాజీనామా
- సరైన వివరణ లేకుండా సోనియాకు లేఖ
- ఆశ్చర్యం వ్యక్తం చేసిన మనీష్ తివారీ
వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇటీవల కాలం అచ్చిరావడం లేదు. వరుస ఓటములు ఈ పార్టీ నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నట్లు కనబడుతోంది. ఈ క్రమంలో పలువురు కీలక నేతలు కాంగ్రెస్ గూడు వదిలి వెళ్లిపోతున్నారు. ఇప్పుడు ఈ వరుసలో పార్టీ సీనియర్ నేత సుస్మితా దేవ్ చేరారు. సుమారు మూడు దశాబ్దాలుగా పార్టీతో కలిసి ఉన్న ఆమె.. తాజాగా తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఒక లేఖ రాశారు.
అయితే పార్టీ వీడటానికి గల కారణాలను సుస్మిత తన లెటర్‌లో వివరించలేదు. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ ప్రస్తావిస్తూ.. మరోసారి పార్టీ అధిష్ఠానంపై విసుర్లు విసిరారు. ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలకు దిగారు. ‘‘సుస్మితా దేవ్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇలా యువనేతలు ఒక్కొక్కరూ పార్టీని వీడుతుంటే.. పార్టీ బలోపేతానికి మేం ఏమీ చేయడం లేదంటూ మాలాంటి వృద్ధులను నిందిస్తారు. కానీ పార్టీ మాత్రం కళ్లకు గంతలు కట్టుకొని ముందుకు సాగిపోతూనే ఉంటుంది’’ అంటూ కపిల్ సిబల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అదే సమయంలో సుస్మిత ఇలా అర్థాంతరంగా రాజీనామా చేయడంపై మరో సీనియర్ నేత మనీష్ తివారీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘ఇది గనుక నిజమైతే ఈ విషయం చాలా దురదృష్టకరం. ఎందుకు సుస్మిత? నీ మునుపటి కొలీగ్స్, స్నేహితులైన వాళ్లు.. ముఖ్యంగా నువ్వు ఢిల్లీ యూనివర్సిటీలో తొలిసారి ఎలక్షన్లలో నిలబడినప్పటి నీ ఎన్ఎస్‌యూఐ (నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా) జాతీయ అధ్యక్షురాలికి నువ్వు ఇంతకన్నా మంచి వివరణ ఇవ్వాలి’’ అంటూ మనీష్ తివారీ ఒక ట్వీట్ చేశారు. దీనికి సుస్మిత రాసిన రాజీనామా లేఖను కూడా జతచేశారు. సుస్మిత తండ్రి సంతోష్ మోహన్ దేవ్.. కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యులే. ఆయన పార్టీ కోసం చాలా సేవలు అందించారు.