Ramya: రమ్య ముందుగానే పోలీసులకు ఫిర్యాదు చేసుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో!: ఇన్చార్జి డీఐజీ రాజశేఖర్
- రమ్య హత్య కేసు వివరాల వెల్లడి
- మీడియా ముందుకొచ్చిన ఇన్చార్జి డీఐజీ
- రమ్యకు శశికృష్ణ ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమైనట్టు వెల్లడి
- ప్రేమ పేరుతో వేధింపులు
- మాట్లాడడం మానేసిన రమ్య
బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు వివరాలను ఇన్చార్జి డీఐజీ రాజశేఖర్ మీడియాకు వివరించారు. సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయం ఈ హత్యకు దారితీసిందని వెల్లడించారు. నిందితుడు శశికృష్ణకు, రమ్యకు ఆర్నెల్ల కిందట ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం జరిగిందని తెలిపారు.
దీన్ని ఆధారంగా చేసుకుని ప్రేమించాలంటూ రమ్య వెంటపడేవాడని, రెండు నెలలుగా మితిమీరి వేధించాడని పేర్కొన్నారు. దాంతో శశికృష్ణతో రమ్య మాట్లాడడం మానేసిందని, ఇది మనసులో పెట్టుకున్న శశికృష్ణ పలుమార్లు బెదిరింపులకు కూడా పాల్పడ్డాడని ఇన్చార్జి డీఐజీ వెల్లడించారు. చివరికి నిన్న ఆమెతో వాగ్వాదం జరిగిన అనంతరం కత్తితో నరికి చంపాడని తెలిపారు.
స్థానికులు అడ్డుకుని ఉంటే రమ్య బతికుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలను అడ్డుకునేందుకు ప్రత్యేక ఫోన్ నెంబర్లు, ప్రత్యేక యాప్ లు, దిశ పెట్రోలింగ్ వంటి సదుపాయాలను ప్రభుత్వం తీసుకువచ్చిందని, కానీ ఎవరూ స్పందించలేదని విచారం వ్యక్తం చేశారు. ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేసి, తాము స్పందించకపోతే అప్పుడు తప్పు పోలీసులదే అవుతుందని అన్నారు. కానీ ప్రజలెవరూ ముందుకు రాలేదని తెలిపారు.
సోషల్ మీడియాలో ఏర్పడే పరిచయాల పట్ల యువత దూరంగా ఉంటే మేలని హితవు పలికారు. ఇలాంటి పరిచయాలను ఆసరాగా చేసుకుని వేధించేవాళ్లపై ఫిర్యాదు చేయాలని, రమ్య కూడా ముందుగానే పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదేమోనని ఇన్చార్జి డీఐజీ వ్యాఖ్యానించారు.
ఇక, ఈ వ్యవహారంలో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. మృతురాలి ఫోన్ డేటా నుంచి డిలీట్ అయిన వివరాలను కూడా రాబట్టి, దర్యాప్తును ముందుకు తీసుకెళతామని అన్నారు. అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలు, దాడులకు సంబంధించి చైతన్యం కలిగించేలా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని డీజీపీ ఆదేశించారని వెల్లడించారు.