Sajjala Ramakrishna Reddy: నా ఎదుగుదలలో గజ్జల మల్లారెడ్డి పాత్ర కీలకం: ప్రభుత్వ సలహాదారు సజ్జల

The role of Gajjala Mallareddy is crucial in my growth Government Adviser Sajjala

  • కడపలో అభ్యుదయ కవి స్మారక పురస్కారాల వేడుక 
  • ముఖ్యఅతిథిగా సజ్జల రామకృష్ణారెడ్డి
  • కార్యక్రమంలో పాల్గొన్న ప్రెస్ అకాడమీ ఛైర్మన్

నిన్నటితరం జర్నలిస్టు, అభ్యుదయ కవి గజ్జల మల్లారెడ్డి పేరిట అందిస్తున్న స్మారక పురస్కారాల వేడుక ఘనంగా జరిగింది. కడప జిల్లాలోని సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన ఎదుగుదలలో గజ్జల మల్లారెడ్డిది కీలక పాత్ర అని చెప్పారు. ఈ మాట చెప్పడాన్ని తాను గర్వంగా భావిస్తానని ఆయన అన్నారు.

ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన గజ్జల మల్లారెడ్డిని స్మరించుకున్నారు. అనంతరం తెలుగు గొప్పదనాన్ని నలుమూలలా చాటి చెప్పిన బ్రౌన్ గ్రంథాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని కొనియాడారు. గజ్జల మల్లారెడ్డి హయాంలో ఉన్నప్పటి మీడియా మళ్లీ తిరిగి రావాలని తాను ఆకాంక్షిస్తున్నానని సజ్జల తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, గజ్జల మల్లారెడ్డి స్మారక అవార్డు ఇవ్వడం చాలా సంతోషమని అన్నారు. ‘‘గజ్జల మల్లారెడ్డి ముక్కుసూటి మనిషి. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని మీడియాలోకి వచ్చిన వారిలో నేనూ ఒకడిని. మల్లారెడ్డి లాగానే విలువలతో కూడిన జర్నలిజాన్ని, సమాజానికి ఉపయోగపడే జర్నలిజాన్ని ప్రోత్సహించాలి’’అని దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు.

గజ్జల మల్లారెడ్డి అలనాటి అభ్యుదయ కవి, కమ్యూనిస్టు పార్టీ నేత. అప్పట్లో ఈనాడు, ఆంధ్రభూమి, ఉదయం పత్రికల సంపాదక వర్గ సభ్యుడిగా పనిచేశారు. మల్లారెడ్డి గేయాలు, శంఖారావం వంటి కవితా సంకలనాలను రచించారు.

  • Loading...

More Telugu News