Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ ప్రజలకు భారత్ చేయూత.. కొత్త ఎలక్ట్రానిక్ వీసా విధానం ప్రకటన
- తాలిబన్ల చర్యల వల్ల ఆందోళనకు గురవుతోన్న ఆఫ్ఘన్ ప్రజలు
- విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు
- కొత్త ఎలక్ట్రానిక్ వీసా విధానాన్ని ప్రకటించిన భారత్
- ఈ-ఎమర్జెన్సీ ఎక్స్ మిస్క్ వీసా ద్వారా వారికి వీసాలు
తాలిబన్లు అధికారంలోకి రావడంతో ఆందోళనకు గురవుతోన్న ఆఫ్ఘనిస్థాన్ ప్రజలకు భారత్ అండగా నిలుస్తోంది. ఆఫ్ఘనిస్థాన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాలిబన్లు ప్రయత్నాలు ప్రారంభించడంతో ఆ దేశ ప్రజలు కొందరు విదేశాలకు వలస పోవాలని ప్రయత్నాలు జరుపుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు భారత్ కు రావడానికి వీలుగా కేంద్ర సర్కారు కొత్త ఎలక్ట్రానిక్ వీసా విధానాన్ని ప్రకటించింది.
భారత్లో ఆఫ్ఘన్ వాసుల ప్రవేశం కోసం వచ్చే దరఖాస్తులను వీలైనంత త్వరగా ఈ విధానం ద్వారా పూర్తి చేస్తారు. ఈ-ఎమర్జెన్సీ ఎక్స్ మిస్క్ వీసా ద్వారా వారికి వీసాలు ఇవ్వనున్నట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ప్రకటన చేసింది. కాగా, ఇప్పటికే ఆఫ్ఘన్లోని భారత రాయబార కార్యాలయ సిబ్బందిని భారత్ తీసుకొస్తోన్న విషయం తెలిసిందే. ఆ దేశంలో చోటు చేసుకుంటోన్న పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది.