Sushmita Dev: సోనియా, రాహుల్‌తో విభేదాలేం లేవు.. పార్టీ వీడటంపై సుస్మితా దేవ్
- తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత
- కాంగ్రెస్‌కు రాజీనామాపై వివరణ ఇవ్వడానికి నిరాకరణ
- సోనియాకు రాసిన లేఖలో వివరించానన్న సుస్మిత
కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత సుస్మితా దేవ్ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఆమె ఒక లేఖ రాశారు. ఆ రోజు సాయంత్రమే ఆమె మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. దీనిపై మరింత వివరణ ఇవ్వాలని విలేకరులు ప్రశ్నించగా సుస్మిత నిరాకరించారు.
తాను చెప్పాల్సిందంతా సోనియాకు రాసిన లేఖలో వివరించానని ఆమె స్పష్టంచేశారు. సుస్మిత వంటి నేత పార్టీని వీడటంపై పలువురు కాంగ్రెస్ నేతలు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. సీనియర్ నేత కపిల్ సిబల్.. దీనికి పార్టీ అధిష్ఠానమే కారణమంటూ ఘాటు ట్వీట్ చేశారు. ‘యువనేతలు పార్టీ వీడుతుంటే.. మా సీనియర్లు పార్టీ కోసం కష్టపడటం లేదని నిందిస్తారు. పార్టీ మాత్రం కళ్లకు గంతలు కట్టుకొని సాగిపోతుంది’ అంటూ ఆయన మండిపడ్డారు.
తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా మాట్లాడిన సుస్మిత.. కాంగ్రెస్‌తో తనది సుదీర్ఘ బంధమని చెప్పారు. ఆ పార్టీ తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చిందన్నారు. ‘‘నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో పార్టీ అధిష్ఠానం నుంచి ఏదీ ఆశించలేదు. నాలోని లోపాలు, వైఫల్యాలను కాంగ్రెస్ అధ్యక్షురాలు క్షమిస్తారని ఆశిస్తున్నా’ అని సుస్మిత పేర్కొన్నారు. తాను తృణమూల్ కాంగ్రెస్‌లో చేరే సమయంలో ఎటువంటి ఆంక్షలు పెట్టలేదని ఆమె చెప్పారు. తనకు ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత నిర్వర్తిస్తానని చెప్పారు.