NCW: రమ్య హత్యపై ఏపీ డీజీపీకి లేఖ రాసిన జాతీయ మహిళా కమిషన్
- ఇటీవల గుంటూరులో రమ్య హత్య
- స్పందించిన జాతీయ మహిళా కమిషన్
- మహిళల భద్రతకు చర్యలు తీసుకోవాలని సూచన
- మహిళలకు భరోసా కల్పించాలని స్పష్టీకరణ
ఏపీలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) స్పందించింది. రమ్య హత్య ఘటనపై నిష్పాక్షిక విచారణ జరపాలంటూ ఎన్సీడబ్ల్యూ చైర్ పర్సన్ రేఖా శర్మ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. మహిళలపై అఘాయిత్యాల కట్టడికి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. మహిళల భద్రతకు భరోసా కల్పించాలని పేర్కొన్నారు.
గుంటూరులోని పెదకాకాని రోడ్డు వద్ద బీటెక్ విద్యార్థిని రమ్యను శశికృష్ణ అనే యువకుడు కత్తితో పొడిచి చంపడం తెలిసిందే. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. సీసీ కెమెరాల్లో ఈ హత్యోదంతం రికార్డయింది. ఈ ఘటనపై వేగంగా స్పందించిన గుంటూరు అర్బన్ పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
ఇన్ స్టాగ్రామ్ లో రమ్య, శశికృష్ణకు పరిచయం ఏర్పడగా, తనను ప్రేమించాలని శశికృష్ణ ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. అయితే, శశికృష్ణ ధోరణి నచ్చని రమ్య అతడిని దూరం పెట్టింది. దాంతో ఆమెపై కక్షగట్టిన యువకుడు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై కత్తికి బలిచేశాడు.