Afghanistan: తాలిబన్లు చంపినా ఆలయం వదలను: ఆఫ్ఘన్‌లోని హిందూ పూజారి
- దేశం దాటిస్తామని చెప్పినా నిరాకరణ
- తరతరాలుగా రత్తన్ నాథ్ ఆలయంలో పూజారులు
- చంపేస్తే అది కూడా సేవే అనుకుంటా: రాజేష్ కుమార్
అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్థాన్‌ను అలా వీడాయో లేదో తాలిబన్లు తమ బలం చూపించారు. ఒక్కొక్కటిగా ఆఫ్ఘనిస్థాన్‌లోని ముఖ్యమైన పట్టణాలన్నింటినీ తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. ఆదివారం నాడు కాబూల్ కూడా వారి వశమైంది. తాలిబన్ల దూకుడు చూసిన ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ సహా చాలా మంది కీలక నేతల దేశం విడిచి పారిపోయారు.
ఇలాంటి సమయంలో కూడా ఆఫ్ఘనిస్థాన్ దాటి రావడానికి ఒక హిందూ పూజారి ససేమిరా అంటున్నాడు. ఆయన పేరు పండిట్ రాజేష్ కుమార్. ఇక్కడి రత్తన్ నాథ్ ఆలయంలో ఆ కుటుంబం తరతరాలుగా పూజారులుగా పనిచేస్తున్నారట. తన పూర్వీకుల నుంచి వస్తున్న ఈ ఆలయాన్ని వదిలి తాను రావడం జరగదని రాజేష్ కుమార్ స్పష్టం చేశారు. కొంతమంది హిందువులు ఆయన్ను దేశం దాటించి, సాయం చేస్తామని చెప్పినా ఆయన నిరాకరించారట.
‘‘వందల ఏళ్లుగా మా పూర్వీకులు ఈ ఆలయంలో సేవ చేస్తున్నారు. కొందరు హిందువులు కాబూల్ వదిలి వెళ్లిపొమ్మన్నారు. వేరే చోటకు వెళ్లడానికి, అక్కడ ఉండటానికి సాయం చేస్తామని అన్నారు. కానీ ఈ ఆలయం మా వంశపారంపర్యంగా వస్తోంది. మేం ఇక్కడ వందల ఏళ్లుగా సేవలు చేస్తున్నాం. అలాంటి ఆలయాన్ని నేను వదల్లేను. తాలిబన్లు గనుక నన్ను చంపేస్తే అది కూడా ఆలయానికి నా సేవగానే భావిస్తా’’ అని రాజేష్ బదులిచ్చారట.
ఈ పూజారి కథను భరద్వాజ్ అనే ట్విట్టర్ యూజర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ కథనంతోపాటు ఆ ఆలయానికి సంబంధించిన పాత వీడియోను కూడా షేర్ చేశారు. ఇతరుల దృష్టి ఆకర్షించకుండా ఉండటం కోసం రత్తన్ నాథ్ ఆలయం ఇల్లులాగే ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రాజేష్ కుమార్ కథ నెట్టింట్లో వైరల్ అవుతోంది.