CBI: షీనా బోరా హత్య కేసు దర్యాప్తు పూర్తి: కోర్టుకు తెలిపిన సీబీఐ
- 60 మంది నుంచి వాంగ్మూలాలు తీసుకున్న అధికారులు
- మొదటి చార్జ్ షీటుకు అదనంగా మరో రెండు సప్లిమెంటరీ చార్జ్ షీట్లు
- 2012లో జరిగిన హత్య.. 2015లో వెలుగులోకి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో దర్యాప్తు పూర్తయినట్లు సీబీఐ తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టుకు సీబీఐ వివరాలు సమర్పించింది. షీనా బోరా కేసులో తదుపరి దర్యాప్తు అవసరం లేదని సీబీఐ అభిప్రాయపడింది. మాజీ మీడియా ఎగ్జిక్యూటివ్ ఇంద్రాణీ ముఖర్జీ ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
2012లో జరిగిన ఈ హత్య 2015లో వెలుగులోకి వచ్చింది. ఇంద్రాణి డ్రైవర్ శ్యామవర్ రాయ్ వేరే కేసులో అరెస్టయ్యాడు. అతని ద్వారానే షీనా బోరా హత్య కేసు బయటపడింది. ఈ కేసులో షీనా తల్లి, ప్రముఖ టీవీ ఛానెల్ యజమానురాలు ఇంద్రాణీ ముఖర్జీని అరెస్టు చేయడం జరిగింది. ఇంద్రాణి రెండో భర్త పీటర్ ముఖర్జీ కూడా ఈ హత్యకు సహకరించినట్లు దర్యాప్తులో తేలడంతో సీబీఐ అతన్ని కూడా అదుపులోకి తీసుకుంది.
ఇంద్రాణి మొదటి భర్త కుమార్తె షీనాబోరా. 25 ఏళ్ల షీనా హత్య కేసులో ఇంద్రాణి అరెస్టయిన తర్వాత సీబీఐ అధికారులు సుమారు 60 మంది సాక్షుల నుంచి వాంగ్మూలాలు సేకరించారు. ఈ కేసులో తొలి చార్జ్ షీట్ దాఖలైన తర్వాత.. కోర్టు అనుమతి తీసుకున్న సీబీఐ మరింత దర్యాప్తు చేసింది. ఈ క్రమంలోనే మరిన్ని ఆధారాలు సేకరించిన కేంద్ర దర్యాప్తు సంస్థ... మరో రెండు సప్లిమెంటరీ చార్జ్ షీట్లను దాఖలు చేసింది.