Taliban: తాలిబన్లకు డబ్బులు కావాలట.. బ్యాంకు అధికారులను నిలదీస్తున్న వైనం!
- అధికశాతం నిధులన్నీ విదేశాల్లోనే
- 0.2 శాతమే తాలిబన్లకు అందుబాటులో
- తాలిబన్లకు ఇవ్వబోమని ఇప్పటికే ప్రకటించిన అమెరికా
- వివరణ ఇచ్చిన సెంట్రల్ బ్యాంక్ తాత్కాలిక గవర్నర్
అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్థాన్‌ను వీడిన పదిరోజుల్లోనే ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లకు షాక్ తగిలింది. దేశం హస్తగతమైంది కానీ దేశానికి సంబంధించిన నిధులు మాత్రం తాలిబన్ల చేతికి చిక్కలేదు. దేశ సెంట్రల్ బ్యాంకులోనే డబ్బంతా ఉంటుందని అనుకున్నారేమో మరి వాళ్లు. అక్కడి బ్యాంకు ఉద్యోగులను డబ్బులు ఎక్కడున్నాయో చెప్పాలంటూ బెదిరిస్తున్నారట. ఈ క్రమంలో దేశం విడిచి వెళ్లిపోయిన ఆఫ్ఘన్ సెంట్రల్ బ్యాంక్ తాత్కాలిక గవర్నర్ అజ్మల్ అహ్మదీ వివరణ ఇచ్చాడు.
ఆఫ్ఘనిస్థాన్ బ్యాంక్ (డీఏబీ) నియంత్రణలో సుమారు 9 బిలియన్ డాలర్ల నిధులుండేవని, వాటిలో సుమారు 7 బిలియన్ డాలర్లు బంగారం, డబ్బు, బాండ్లు, ఇతర పెట్టుబడుల రూపంలో యూఎస్ ఫెడరల్ రిజర్వులో ఉన్నాయని అహ్మదీ వెల్లడించారు. మిగతా నిధుల్లో కూడా అధికశాతం బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్లో, ఇతర అంతర్జాతీయ ఖాతాల్లో ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్థాన్ ద్రవ్యనిల్వల్లో కేవలం 0.2 శాతం మాత్రమే తాలిబన్లకు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు.
డీఏబీ అంతర్జాతీయ నిల్వలపై వివరణ ఇచ్చేందుకే తాను ఈ ట్వీట్లు చేస్తున్నట్లు అహ్మదీ తెలిపారు. తాలిబన్లు డీఏబీ సిబ్బందిని ఆస్తులు ఎక్కడున్నాయో చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆయన అన్నారు. అదే గనుక నిజమైతే తాలిబన్లు తమ బృందంలో ఒక ఆర్థికవేత్తను చేర్చుకోవాల్సిన అవసరముందంటూ చురకలేశారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లో భారీగా కరెంట్ ఖాతా లోటు ఉందని, ఈ క్రమంలోనే కొన్ని వారాలకు కొంత మొత్తంలో డబ్బు ఆఫ్ఘనిస్థాన్‌కు రవాణా అయ్యేదని అహ్మదీ తెలిపారు.
అయితే కొన్నిరోజులుగా ఆఫ్ఘనిస్థాన్‌లో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ ఈ షిప్మెంట్ నిలిచిపోయిందని వివరించారు. అలాగే ఏ అంతర్జాతీయ ఖాతాలో చోరీ జరగలేదని, ఒక్క రూపాయి కూడా ఎక్కడకూ పోలేదని తేల్చిచెప్పారు. కాగా, యూఎస్ రిజర్వ్‌లో నిల్వ ఉన్న ఆఫ్ఘనిస్థాన్ ఆస్తుల్లో చిల్లిగవ్వ కూడా తాలిబన్లకు దక్కనివ్వబోమని అమెరికా స్పష్టంచేసింది.