Taliban: తాలిబన్ ప్రభుత్వంతో భారత్-ఆఫ్ఘన్ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం.. ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఆందోళన
- 2020-21లో ఇరుదేశాల మధ్య రూ.10 వేల కోట్ల వాణిజ్యం
- ఆఫ్ఘనిస్థాన్‌కు దక్షిణాసియాలోనే పెద్ద మార్కెట్ భారత్
- ఒక్క కాబూల్తోనే ఏటా రూ.10 వేల కోట్ల వ్యాపారం
ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ పదిరోజుల్లోనే ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్ ఉగ్రమూకలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్థాన్-భారత్ మధ్య వాణిజ్యంపై ఇది చాలా ప్రభావం చూపుతుందని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) తెలిపింది.
ఈ రెండు దేశాల మధ్య 2020-2021లో రూ.10 వేల కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగిందని తెలిపింది. వీటిలో 6 వేల కోట్ల రూపాయల వస్తువులను ఆఫ్ఘనిస్థాన్‌కు భారత్ ఎగుమతి చేయగా, సుమారు రూ.3,800 కోట్ల విలువైన వస్తువులు దిగుమతి చేసుకుంటోంది. ఈ క్రమంలో తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి అధికారంలోకి వచ్చారు. వీరి దూకుడు చూసి ఆ దేశాధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ సైతం దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్థాన్‌తో ద్వైపాక్షిక వాణిజ్యం తీవ్రంగా దెబ్బతింటుందని, ముఖ్యంగా భవిష్యత్తుపై నెలకొన్న అసందిగ్ధత సమస్యాత్మకంగా మారిందని సీటీఐ చైర్మన్ బ్రిజేష్ గోయల్ అన్నారు. ప్రజలను తరలించడం కష్టంగా మారిందని, అలాగే వాళ్ల చెల్లింపులు పెద్ద ఎత్తున ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
దక్షిణాసియాలో ఆఫ్ఘనిస్థాన్‌కు అతిపెద్ద మార్కెట్ భారతే. ఆఫ్ఘన్ నుంచి భారత్ ముఖ్యంగా డ్రైఫ్రూట్స్, పండ్లు, ఆయుర్వేద మూలికలు దిగుమతి చేసుకుంటోంది. అదే సమయంలో టీ, కాఫీ, కాటన్, మిరియాలు తదితరాలను ఆఫ్ఘనిస్థాన్‌కు ఎగుమతి చేస్తున్నామని సీటీఐ తెలిపింది. ఒక్క కాబూల్తోనే సుమారు రూ.వెయ్యి కోట్ల వ్యాపారం జరిగేదని, ఇప్పుడు అది నిలిచిపోయిందని సీటీఐ ఆందోళన వ్యక్తం చేసింది.