Police: ప్రియుడిని కేసులో ఇరికించడానికి 'అత్యాచారం' నాటకం ఆడిన హైదరాబాద్ అమ్మాయి!
- సంతోష్ నగర్ అత్యాచారం కేసును ఛేదించిన పోలీసులు
- రాత్రి 9.30కు ఇంటికి వెళ్లాల్సిన యువతి
- 10.30 గంటలకు వెళ్లిన వైనం
- ఎందుకు ఆలస్యం అయిందని ఇంట్లో వారు అడగడంతో కట్టుకథ
- తనను కాదన్న ప్రియుడిని కేసులో ఇరికించే యత్నం
హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి (20) తనపై అత్యాచారం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆమె మాటలు పొంతన లేకుండా ఉండడంతో అనుమానం వచ్చిన పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేయడంతో అసలు ఆమెపై అత్యాచారం జరగలేదని తేలింది. మంగళవారం రాత్రి 9.30కు ఇంటికి వెళ్లాల్సిన యువతి 10.30 గంటలకు వెళ్లింది. దీంతో ఎందుకు ఆలస్యం అయిందని ఇంట్లో వారు అడగడంతో ఆమె తనపై అత్యాచారం జరిగిందని చెప్పిందని పోలీసులు గుర్తించారు.
పూర్తి వివరాల్లోఇక వెళ్తే.. ల్యాబ్ టెక్నీషియన్‌గా సంతోష్ నగర్‌లోని ఓ ఆసుపత్రిలో ఆ యువతి శిక్షణ పొందుతోంది. ఫిసల్‌బండకు చెందిన ఆ యువతి మంగళవారం రాత్రి 10.30 గంటలకు ఇంటికి వెళ్లింది. ఆలస్యంగా రావడంతో తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నించారు. ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడని యువతి తల్లిదండ్రులకు చెప్పింది.
దీంతో యువతితో కలిసి ఆమె తల్లిదండ్రులు సంతోష్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సౌత్ జోన్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, యువతి ప్రతిరోజు ప్రయాణించే యాదగిరి థియేటర్ నుంచి పహాడీషరీఫ్ వరకు రోడ్లపై ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఆ యువతి చెప్పిన వివరాలతో పోల్చి చూస్తే పోలీసులకు ఒక్క ఆధారం కూడా దొరకలేదు.
అంతేకాదు, ఆ యువతి ఇంటి నుంచి ఆమె పనిచేస్తోన్న ఆసుపత్రికి రెండు కిలోమీటర్లు కూడా దూరం ఉండదు. అయినప్పటికీ ఆ యువతి చెప్పిన వివరాల ఆధారంగా సంతోష్‌నగర్ నుంచి మైలార్‌దేవ్‌పల్లి, పహాడీషరీఫ్ ప్రాంతాల్లో సెల్ టవర్ సిగ్నల్స్‌నూ పరిశీలించారు. ఆటో డ్రైవర్లనూ విచారించారు. యువతిపైనే అనుమానం వచ్చి పలు కోణాల్లో విచారించగా అసలు విషయం బయటపడింది.
ఆ అమ్మాయి ప్రేమించిన యువకుడు మరో యువతితో వివాహం నిశ్చయం చేసుకున్నాడన్న కోపంతోనే ఆమె అతడిని అత్యాచారం కేసులో ఇరికించేందుకు నాటకమాడినట్లు పోలీసులు తేల్చారు. వైద్య పరీక్షల్లోనూ ఆ యువతిపై అత్యాచారం జరగలేదని తేలినట్లు తెలిసింది. తప్పుడు సమాచారం ఇచ్చి పోలీసులను పరుగులు పెట్టించినందుకు ఆమెపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.