Reserve Bank Of India: కస్టమర్ కు నష్టం జరిగితే లాకర్ అద్దెకు 100 రెట్లు బ్యాంకులు చెల్లించాల్సిందే: లాకర్ నిబంధనలను మార్చిన ఆర్బీఐ
- బ్యాంకు వల్ల జరిగిన తప్పులకు పూర్తి బాధ్యత బ్యాంకుదే
- ప్రకృతి విపత్తులకు దీని నుంచి మినహాయింపు
- విపత్తుల ముప్పులేని ప్రాంతాల్లో బ్యాంకుల ఏర్పాటు
- లాకర్ రెంట్ చెల్లించకుంటే పగులగొట్టే అధికారం
అగ్ని ప్రమాదాలు, దొంగతనాలు, బ్యాంక్ భవనం కూలిపోవడం, బ్యాంకు ఉద్యోగి మోసాలకు పాల్పడిన ఘటనల్లో.. బ్యాంకులు వసూలు చేసే లాకర్ అద్దెలో వినియోగదారులకు 100 రెట్లు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పష్టం చేసింది. ఈమేరకు బ్యాంక్ లాకర్ల నిబంధనల్లో ఆర్బీఐ మార్పులు చేసింది. ఈ నూతన నిబంధనలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. లాకర్లలో అక్రమ లావాదేవీలు లేదా హానికరమైన వస్తువులు/సామగ్రిని దాచకుండా బ్యాంకులు నిబంధనలను సవరించుకోవాలని సూచించింది.
బ్యాంకింగ్, టెక్నాలజీలో జరుగుతున్న మార్పులు, వినియోగదారుల సమస్యలు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ‘డిపాజిట్ లాకర్/సేఫ్ కస్టడీ ఆర్టికల్ ఫెసిలిటీ’ల్లోని నిబంధనలను సవరించినట్టు తెలిపింది. దీని కోసం యునైటెడ్ బ్యాంక్, అమితాబ్ దాస్ గుప్తా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునూ పరిగణనలోకి తీసుకున్నట్టు పేర్కొంది.
ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త నిబంధనలు పాత, కొత్త లాకర్లకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. లాకర్లను వినియోగదారులకు కేటాయించడం కోసం శాఖలవారీగా ఖాళీగా ఉన్న లాకర్ల జాబితాను బ్యాంకులు ఎప్పటికప్పుడు మెయింటెయిన్ చేయాలని, ప్రధాన బ్యాంకింగ్ వ్యవస్థలో ‘వెయిట్ లిస్ట్’ జాబితాను కలిగి ఉండాలని సూచించింది. లాకర్ ను కేటాయించిన వెంటనే రసీదును అందజేయాలని, ఒకవేళ వేచి చూసే జాబితాలో ఉండి ఉంటే ఆ సంఖ్యను వినియోగదారుడికి వివరించాలని తెలిపింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ రూపొందించిన మోడల్ లాకర్ ఒప్పందాన్ని బ్యాంకులు అమలు చేయాలని ఆర్బీఐ సూచించింది.
బ్యాంకుల నిర్లక్ష్యం వల్ల జరిగే ప్రమాదాలతో నష్టపోయే వినియోగదారులకు బ్యాంకులే నష్టపరిహారం చెల్లించాలని తేల్చి చెప్పింది. అయితే, వరదలు, భూకంపాలు, పిడుగులు, కుంభవృష్టి వంటి ప్రకృతి విపత్తులు/దైవ చర్యలతో కలిగే నష్టానికి బ్యాంకులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనల్లో బ్యాంకులు పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
అయితే, ఇలాంటి విపత్తుల ముప్పు ఎక్కువగా లేని సురక్షితమైన ప్రాంతాల్లో బ్యాంకులను ఏర్పాటు చేయాలని ఆర్బీఐ సూచించింది. లాకర్లను వీలైనంత వరకు కాపాడేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. లాకర్ అద్దెలను వినియోగదారులు టైంకు కట్టాల్సిందేనని, వరుసగా మూడేళ్లు కట్టకుంటే కస్టమర్లకు చెప్పకుండానే లాకర్లను పగులగొట్టే అధికారాన్ని బ్యాంకులకు ఇచ్చింది. అయితే, దానికి అన్ని నిబంధనలు తు.చ. తప్పకుండా పాటించాలని సూచించింది.
ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఇకపై లాకర్ అగ్రిమెంట్ సమయంలోనే మూడేళ్ల కాలపరిమితి కలిగిన టర్మ్ డిపాజిట్ చేయించుకోవాలని పేర్కొంది. ఇప్పటికే లాకర్ కలిగి ఉన్న వారిని టర్మ్ డిపాజిట్ కోసం ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఓ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ లో చిన్న సైజు లాకర్ కు రూ.2 వేలు, మధ్యస్థ లాకర్ కు రూ.4 వేలు, పెద్ద లాకర్ కు రూ.8 వేల చొప్పున ఏటా చార్జీలను వసూలు చేస్తున్నారు. ఈ అద్దెలు నగరాలు, మెట్రో సిటీలకు సంబంధించినవి. ఆ చార్జీలపై 18 శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నారు.