Raghu veera: చీరకట్టులో పల్లెటూరిలో పొలం పనులు చేస్తున్నట్లు రఘువీరారెడ్డి మనవరాలు ఫొటోలు.. వైరల్
- పొటోలు పోస్ట్ చేసిన రఘువీరా
- పొలంలో మనవరాలితో కలిసి ఫొటోలు
- 'పల్లెటూరి పిల్ల నా మనుమరాలు సమైరా' అంటూ వ్యాఖ్య
ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటోన్న విషయం తెలిసిందే. అనంతపురంలోని తన సొంత గ్రామంలోనే ఆయన చాలా కాలంగా కుటుంబ సభ్యులతో కలసి హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు. ఆయన కూడా ఓ రైతులా వ్యవసాయ పనులు చేసుకుంటుండడం గమనార్హం. ఇందుకు సంబంధించిన ఫొటోలు గతంలో వైరల్ అయ్యాయి.
తాజాగా, రఘువీరారెడ్డి తన మనవరాలి క్యూట్ ఫొటోలను పోస్ట్ చేశారు. 'పల్లెటూరి పిల్ల నా మనుమరాలు సమైరా' అంటూ ఆయన పేర్కొన్నారు. ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో రఘువీరారెడ్డి మనవరాలు చీరకట్టులో కనపడుతుండడం అలరిస్తోంది. తాతయ్య తొడపై కూర్చొని ఆమె ఓ ఫొటో దిగింది.
చాటతో ధాన్యం చెరుగుతూ చేస్తూ మరో ఫొటో దిగింది. అలాగే, వ్యవసాయ బావిలో రాగి చెంబులో నీరు తీసుకుంటున్నట్లు, పొలంలో గడ్డపారపట్టుకుని పనులు చేస్తున్నట్లు సమైరా దిగిన ఫొటోలు అలరిస్తున్నాయి.
చాలా కాలం తర్వాత రఘువీరారెడ్డి తన ఫొటోను పోస్ట్ చేశారు. ఇందులో ఆయన కూడా సరికొత్తగా కనపడ్డారు. తెల్లగడ్డంతో ఉన్నారు. తెల్ల పంచె కట్టుకుని పొలంలో ఆయన తన మనవరాలితో కలిసి ఫొటో దిగారు.